బతుకమ్మ వేడుకలకు సన్నద్ధం.. శివునిపల్లిలో ఏర్పాట్లను ముమ్మరం చేసిన కౌన్సిలర్ రాజేశ్వర్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు10 అక్టోబర్, 202611:24 AM

స్టేషన్ ఘనాపూర్, అక్టోబర్ 10 (ప్రజాధ్వని): బతుకమ్మ పండుగను పురస్కరించుకుని స్టేషన్ ఘనాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి 4వ వార్డులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆడబిడ్డలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత వాతావరణంలో పండుగను జరుపుకునేలా వార్డు కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ ముందస్తు చర్యలు చేపట్టారు. వార్డులోని చెరువు కట్ట వద్ద పెరిగిన ముళ్లపొదలు, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా మహిళలకు అసౌకర్యం కలగకుండా చెరువు కట్టను చదును చేయించడంతో పాటు, వేడుకలకు అవసరమైన లైటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. పండుగకు ముందే అన్ని పనులు పూర్తి చేసి మహిళలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని, తమ వార్డులో మహిళలు సంతోషంగా, ఘనంగా పండుగ జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బతుకమ్మ వేడుకల కోసం కౌన్సిలర్ చేపడుతున్న చర్యలపై స్థానిక మహిళలు, వార్డు సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
