ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    పార్టీ బలోపేతమే లక్ష్యం.. క్రమశిక్షణతో పనిచేయాలి_ఎమ్మెల్యే కడియం శ్రీహరి

    • కొత్త, పాత తేడా లేకుండా అందరినీ కలుపుకుపోవాలి
    • రాహుల్‌గాంధీ ప్రధాని కావాలి..
    • రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావాలి: కడియం శ్రీహరి
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు23 సెప్టెంబర్, 202605:02 AM
    పార్టీ బలోపేతమే లక్ష్యం.. క్రమశిక్షణతో పనిచేయాలి_ఎమ్మెల్యే కడియం శ్రీహరి
    స్టేషన్‌ఘన్‌పూర్‌, సెప్టెంబర్‌ 22 ప్రజాధ్వని :గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకున్నప్పుడే కాంగ్రెస్‌ బలపడుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీలో కొత్త, పాత అనే తేడా లేకుండా అందరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. పార్టీ కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజల్లో పార్టీకి మరింత బలం చేకూర్చాలని పిలుపునిచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ పట్టణంలోని ఎస్‌ కన్వెన్షన్‌లో మంగళవారం నిర్వహించిన మండల, గ్రామ, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమం, మండల విస్తృతస్థాయి సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల కమిటీ కార్యవర్గ సభ్యులు, గ్రామ అధ్యక్షులకు కండువాలు కప్పి శాలువాలతో సత్కరించారు. సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీకైనా గ్రామస్థాయి నాయకత్వమే పునాది అని అన్నారు. పార్టీ నాయకత్వం బలంగా ఉంటేనే ఎన్నికల్లో పార్టీకి బలం చేకూరుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కొత్త, పాత అనే భావనలకు తావివ్వకుండా అందరూ కలిసి పనిచేయాలని, పార్టీతో కలిసి వచ్చే వారిని సైతం కలుపుకొని ముందుకు సాగాలని అన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడే వారిని ప్రోత్సహిస్తానని తెలిపారు. అదే సమయంలో పార్టీలో ఉంటూ పార్టీకి, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పనిచేసే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.
    పార్టీ బలోపేతమే లక్ష్యం.. క్రమశిక్షణతో పనిచేయాలి_ఎమ్మెల్యే కడియం శ్రీహరి  - అదనపు చిత్రం 1
    ప్రతి కార్యకర్త పార్టీ నిబంధనలు, క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు ఏవైనా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా నిలిచేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలను పార్టీ శ్రేణులు ప్రజల్లో వాస్తవాలతో తిప్పికొట్టాలని కడియం శ్రీహరి సూచించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ధరణిని అడ్డుపెట్టుకొని భూకబ్జాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రైతులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో నీటి లభ్యత వంటి అంశాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
    పార్టీ బలోపేతమే లక్ష్యం.. క్రమశిక్షణతో పనిచేయాలి_ఎమ్మెల్యే కడియం శ్రీహరి  - అదనపు చిత్రం 2
    వానాకాలం పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తాను ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టుపై అప్పట్లో కొందరు విమర్శలు చేశారని కడియం శ్రీహరి గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉండదంటూ కొందరు పిండప్రదానం కూడా చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం అదే దేవాదుల ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతూ పాడిపంటలు పండుతున్నాయని అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తాను చేపట్టిన ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందడం కంటే సంతృప్తినిచ్చే విషయం మరొకటి ఉండదని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
    పార్టీ బలోపేతమే లక్ష్యం.. క్రమశిక్షణతో పనిచేయాలి_ఎమ్మెల్యే కడియం శ్రీహరి  - అదనపు చిత్రం 3

    రూ.14.28 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

    సమావేశానికి ముందు స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు రూ.14,28,500 విలువైన చెక్కులను కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బెల్దే వెంకన్న, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: