స్టేషన్ ఘనపూర్‌లో వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు12 ఏప్రిల్, 202610:42 AM

స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 12 ప్రజాధ్వని :
పేదల స్వంత ఇంటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. తానేదార్‌పల్లి గ్రామాన్ని ఇందిరమ్మ ఇళ్ల పైలట్ గ్రామంగా ఎంపిక చేసి 91 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. ఆదివారం తానేదార్‌పల్లిలో రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ ఒక్క గ్రామంలోనే రూ.4.55 కోట్ల వ్యయంతో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. పేదలకు గృహ వసతి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, రాష్ట్రంలో ముందువరుసలో నిలిచిందని వెల్లడించారు. సర్పంచులు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి మే 31లోగా మొదటి విడత ఇళ్లను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుని వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు నేరుగా లాభం చేకూరుతోందని ఆయన అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు. సాగునీటి విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి కాలువల మరమ్మతులు చేపట్టి ప్రతి గ్రామానికి నీరు అందిస్తున్నామని చెప్పారు. దీంతో నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని వివరించారు. అయితే కొంతమంది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అవకాశాలు వచ్చినప్పుడు పనులు చేయకుండా ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు.


