ఆర్టీఐ కమిటీ మండల అధ్యక్షుడిగా మహమ్మద్ సలీం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు3 అక్టోబర్, 202602:05 AM

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబరు 2: సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ స్టేషన్ ఘన్‌పూర్ మండల అధ్యక్షుడిగా మహమ్మద్ సలీం నియమితులయ్యారు. జనగామ జిల్లా కమిటీ నిర్ణయం మేరకు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ పాషా నియామక పత్రాన్ని అందజేసి సలీంను అభినందించారు. ఈ సందర్భంగా జావిద్ పాషా మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం కీలకమన్నారు. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పిస్తూ, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేసే నాయకత్వం అవసరమని తెలిపారు. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకంతో సలీంను మండల అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ సలీం మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ పాషాకు కృతజ్ఞతలు తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మండలంలోని ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించేలా ప్రజలకు మార్గనిర్దేశం చేస్తానని చెప్పారు. కమిటీ ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేసి సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాట కుమారస్వామి, జనగామ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావిద్, రఘునాథ్‌పల్లి మండల అధ్యక్షుడు కుకుడాల కిరణ్‌లకు సలీం కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం, మార్గదర్శకత్వంతో సంస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు సేవలందిస్తానని పేర్కొన్నారు. సలీం నియామకం పట్ల కమిటీ నాయకులు, సభ్యులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో ప్రజల్లో సమాచార హక్కు చట్టంపై మరింత అవగాహన పెరుగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కమిటీ చురుకైన పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
