ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    స్టేషన్‌ఘన్‌పూర్‌కు విద్యుత్ వెలుగులు.. 7 సబ్‌స్టేషన్లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన

    • పల్లగుట్ట వేదికగా రూ.60.62 కోట్ల విద్యుత్ పనులకు శ్రీకారం
    • డిప్యూటీ సీఎం భట్టి చేత 7 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపన
    • రఘునాథపల్లి సబ్‌స్టేషన్ అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే కడియం విజ్ఞప్తి
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు9 జూన్, 202612:08 PM
    స్టేషన్‌ఘన్‌పూర్‌కు విద్యుత్ వెలుగులు.. 7 సబ్‌స్టేషన్లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
    చిల్పూర్, జూన్ 9 ప్రజాధ్వని : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా రూ.60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శ్రీకారం చుట్టారు. చిల్పూర్ మండలం పల్లగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు సబ్‌స్టేషన్లను ప్రారంభించి, మరో మూడు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం పల్లగుట్ట క్రాస్ నుంచి సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. రూ.43.92 కోట్లతో వేలేరు మండలం పీచరలో నిర్మించిన 132/33 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు కొండాపూర్ (రూ.2.50 కోట్లు), సాగరం (రూ.2.29 కోట్లు), కుర్చపల్లి (రూ.2.25 కోట్లు) 33/11 కేవీ సబ్‌స్టేషన్లను ప్రారంభించారు. అలాగే పల్లగుట్ట (రూ.3.25 కోట్లు), లింగంపల్లి (రూ.2.81 కోట్లు), నష్కల్ (రూ.3.60 కోట్లు) గ్రామాల్లో నిర్మించనున్న మూడు కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 107 స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి రుణాల కింద రూ.3.07 కోట్లు, 407 సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా రూ.32.89 కోట్ల చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు. దేవాదుల ప్రాజెక్టుతో లక్ష ఎకరాలు సాగులోకి: కడియం
    స్టేషన్‌ఘన్‌పూర్‌కు విద్యుత్ వెలుగులు.. 7 సబ్‌స్టేషన్లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన - అదనపు చిత్రం 1
    దేవాదుల ప్రాజెక్టుతో లక్ష ఎకరాలు సాగులోకి:ఎమ్మెల్యే కడియం శ్రీహరి
    సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఒకప్పుడు వలసలకు కేంద్రంగా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతం దేవాదుల ప్రాజెక్టు, ఉచిత విద్యుత్ కారణంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రస్తుతం లక్ష ఎకరాలకు పైగా సాగులోకి వచ్చి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక వరి దిగుబడులు సాధిస్తున్న నియోజకవర్గంగా నిలిచిందని పేర్కొన్నారు. రఘునాథపల్లి 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను 220/132 కేవీ సబ్‌స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, గ్రామాల్లో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్ల మార్పిడికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎంను కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను గతంలాగే సమగ్రంగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
    స్టేషన్‌ఘన్‌పూర్‌కు విద్యుత్ వెలుగులు.. 7 సబ్‌స్టేషన్లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన - అదనపు చిత్రం 2
    కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి వేగం: ఎంపీ కావ్య
    వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ గత పదేళ్లలో స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గానికి దాదాపు రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజలు అప్రమత్తంగా గమనించాలని పిలుపునిచ్చారు.
    స్టేషన్‌ఘన్‌పూర్‌కు విద్యుత్ వెలుగులు.. 7 సబ్‌స్టేషన్లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన - అదనపు చిత్రం 3
    బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి_ డిప్యూటీ సీఎం భట్టి
    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. ఆ అప్పుల కారణంగా ప్రస్తుతం ప్రభుత్వం ఏటా రూ.76 వేల కోట్ల మేర వడ్డీలు, అప్పు చెల్లింపులు చేయాల్సి వస్తోందన్నారు. డిస్కంలకు బకాయిలు చెల్లించకుండా వాటిని అప్పులపాలు చేసిన వారే ఇప్పుడు విద్యుత్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు ఉచిత విద్యుత్, గృహజ్యోతి పథకం కింద విద్యుత్ బిల్లుల చెల్లింపుగా ప్రభుత్వం ఏటా వేల కోట్లు డిస్కంలకు చెల్లిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం కొనుగోలు చేయకపోయినా రైతులు పండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రస్తావించిన రఘునాథపల్లి సబ్‌స్టేషన్ అప్‌గ్రేడేషన్ ప్రతిపాదనను పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో ఇళ్లపై నుంచి వెళ్తున్న ప్రమాదకర విద్యుత్ లైన్ల మార్పిడికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తోందని పేర్కొన్నారు.
    స్టేషన్‌ఘన్‌పూర్‌కు విద్యుత్ వెలుగులు.. 7 సబ్‌స్టేషన్లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన - అదనపు చిత్రం 4
    ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి, తెలంగాణ హజ్ కమిటీ ఛైర్మన్ ఖుస్రో పాషా, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ రెడ్డి,రేవురి ప్రకాష్‌ రెడ్డి, కె.ఆర్ నాగరాజు,గండ్ర సత్యనారాయణరావు,మామిడాల యశస్వినీ రెడ్డి, కుడా చైర్మన్, డిసిసి అధ్యక్షులు, హనుమకొండ జిల్లా ఇనుగాల వెంకట్రాం రెడ్డి, డిసిసి అధ్యక్షురాలు, జనగామ జిల్లా లకావత్ ధన్వంతి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సియండి ట్రాన్స్‌కో డి. కృష్ణ భాస్కర్, సియండి టీజీఎన్‌పిడిసిఎల్ కర్నాటి వరుణ్‌ రెడ్డి, కమీషనర్ ఆఫ్ పోలీసు సన్ ప్రీత్‌ సింగ్, డిసిపి రాజ మహేంద్ర నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ లావణ్య శిరీష్‌ రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవస్థానం, ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌ రావు, పల్లగుట్ట గ్రామం సర్పంచ్ ఎనగందుల నర్సింహా రెడ్డి, సాగరం సర్పంచ్ మమత చేతన్, కొండాపూర్ సర్పంచ్ గుగులోత్ దేవేందర్, కుర్చపల్లి సర్పంచ్ బైకాని రాజు, నష్కల్ సర్పంచ్ రాజు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: