భూమి కోసం.. భుక్తి కోసం.. ఆత్మగౌరవం కోసం!
- తెలంగాణ గడ్డపై అగ్నికణంలా రగిలిన వీరనారి చాకలి ఐలమ్మ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు26 సెప్టెంబర్, 202606:01 AM

ప్రజాధ్వని ప్రత్యేక కథనం:తెలంగాణ చరిత్రలో పీడిత, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరనారుల్లో చాకలి ఐలమ్మ పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. సామాన్య కుటుంబంలో పుట్టి.. కులవృత్తినే జీవనాధారంగా చేసుకుని పేదరికంలో జీవించిన ఓ మహిళ.. భూస్వామ్య పెత్తందారీ, వెట్టిచాకిరీ, దోపిడీ, అణచివేతలకు ఎదురొడ్డి నిలిచింది. తన కష్టంతో సాగు చేసిన భూమి, పండించిన పంటను కాపాడుకోవడానికి మొదలైన ఆమె పోరాటం.. క్రమంగా రైతుల హక్కులు, మహిళల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం సాగిన ప్రజా పోరాటానికి ప్రతీకగా మారింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ఆమె పేరు చెరగని ముద్ర వేసుకుంది.
కిష్టాపురంలో పుట్టి.. పాలకుర్తిలో పోరాట యోధురాలిగా
చిట్యాల ఐలమ్మ అసలు పేరు. 1895 సెప్టెంబర్ 26న అప్పటి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ–సాయిల దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించింది. చిన్ననాటి నుంచే పేదరికాన్ని, కులవృత్తి కష్టాలను అనుభవించింది. బాల్యంలోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. వారికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబ పోషణ కోసం చాకలి వృత్తితో పాటు వ్యవసాయంపైనా ఆధారపడాల్సి వచ్చింది. పాలకుర్తి ప్రాంతంలో భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. అది నిజాం పాలనలో తెలంగాణ పల్లెల్లో భూస్వాముల పెత్తందారీ బలంగా ఉన్న కాలం. పేద రైతులు చెమటోడ్చి పంట పండించినా.. ఆ పంటపై పూర్తి హక్కు ఉండేది కాదు. కౌలు, పన్నులు, బలవంతపు వసూళ్లు, వెట్టి వంటి విధానాలతో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరంగా ఉండేవి. పల్లెల్లో దొరల మాటే శాసనంగా సాగేది. మహిళల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఐలమ్మ వెట్టిచాకిరీకి స్వస్తి చెప్పి స్వాభిమానంతో బతకాలని నిర్ణయించుకుంది. 1940–44 మధ్యకాలంలో విస్నూరు దేశ్ముఖ్ ఆధిపత్యానికి, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఆమె గళమెత్తింది. ప్రజా సమస్యలపై చైతన్యం కల్పిస్తున్న ఆంధ్ర మహాసభ కార్యకర్తలతో ఆమెకు అనుబంధం ఏర్పడింది. ఉద్యమకారులకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది. దీంతో ఆమె ఇల్లు ఉద్యమ కార్యకలాపాలకు అండగా నిలిచింది. ఐలమ్మ జీవితంలో అసలు మలుపు తిరిగింది మాత్రం భూమి, పంట విషయంలోనే. తాను కష్టపడి సాగు చేస్తున్న భూమిపై విస్నూరు దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి వర్గం ఆధిపత్యం చూపేందుకు ప్రయత్నించింది. ఐలమ్మ పండించిన పంటను స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగింది. కానీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన చెమటతో పండించిన పంటపై తనకే హక్కు ఉందని స్పష్టం చేసింది. “ఈ భూమి నాది.. పండించిన పంట నాది.. తీసుకెళ్లడానికి దొర ఎవ్వడు?” అనే ధిక్కార స్వరం అప్పటి దొరతనాన్ని సూటిగా ప్రశ్నించింది. పేద మహిళగా తనపై ఒత్తిడి తెచ్చినా.. భయపడి వెనక్కి తగ్గకుండా హక్కు కోసం నిలబడిన ఐలమ్మ తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
తుపాకీకి భయపడని ధైర్యం.. దొరతనాన్ని సవాల్ చేసిన స్వరం
ఐలమ్మ తన సమస్యను కేవలం తన కుటుంబ సమస్యగా చూడలేదు. తన చుట్టూ ఉన్న పేదలను, రైతులను ఏకం చేసింది. దొరల పెత్తందారీకి ఎదురు నిలవాలని ధైర్యం చెప్పింది. దీంతో ఆమెపై ఒత్తిళ్లు మరింత పెరిగాయి. కుటుంబ సభ్యులపై కేసులు, అరెస్టులు, వేధింపులు ఎదురయ్యాయి. అయినా ఐలమ్మ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఐలమ్మను పిలిపించి తుపాకీతో బెదిరించిన సమయంలోనూ ఆమె భయపడకుండా దొరనే ప్రశ్నించినట్లు ఉద్యమ చరిత్రలో చెప్పబడుతుంది. “నన్ను కాల్చినా ఏం కాదు. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది.. ఐదుగురు కొడుకులున్నారు. నీకు ఒక్కడే కొడుకు ఉన్నా వేల ఎకరాల భూమి ఉంది. ఇంకా ఇతరుల భూములు ఎందుకు గుంజుకుంటున్నావు?” అంటూ ప్రశ్నించిన ఆమె మాటలు దొరతనాన్ని నేరుగా సవాల్ చేశాయి. తనను చంపినా ప్రజలు తిరగబడతారని.. దొరల గడీలు కూలిపోతాయని హెచ్చరించిన ఆమె ధైర్యం అప్పటి ప్రజల్లో కొత్త నమ్మకాన్ని నింపింది. ఆమె పోరాటంలో ఒక మహిళ వ్యక్తిగత ధైర్యం మాత్రమే కనిపించలేదు. పేదలు, రైతులు, కూలీలు అనుభవిస్తున్న బాధకు ఒక గొంతు దొరికింది. తన పంటను కాపాడుకోవడానికి మొదలైన పోరాటం క్రమంగా రైతుల హక్కుల పోరాటంగా మారింది. భూమిని సాగు చేసేవారికే హక్కు ఉండాలి.. శ్రమకు తగిన ఫలితం దక్కాలి.. వెట్టిచాకిరీ అంతం కావాలి.. అన్యాయాన్ని ప్రశ్నించాలి.. అనే భావాలకు ఐలమ్మ పోరాటం ప్రతీకగా నిలిచింది. 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాలంలో ఐలమ్మ పేరు మహిళా ప్రతిఘటనకు ప్రతీకగా మారింది. ఆమె పోరాటం తన కుటుంబ భూమి కోసం మాత్రమే కాకుండా.. భూస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రజల్లో చైతన్యం పెంచిన పోరాటంగా నిలిచింది. సాధారణ రజక కుటుంబానికి చెందిన మహిళ కూడా దొరల అధికారాన్ని ప్రశ్నించగలదని ఐలమ్మ తన కార్యాచరణతో చాటిచెప్పింది. మహిళా ఆత్మగౌరవానికి కూడా ఐలమ్మ పోరాటం ఒక బలమైన ప్రతీకగా నిలిచింది. మహిళలు ఇంటి గడప దాటి ప్రజా సమస్యలపై మాట్లాడగలరని.. అన్యాయాన్ని ఎదుర్కొనగలరని ఆమె జీవితం చాటిచెప్పింది. పేదరికం తన బలహీనత కాదని.. కులవృత్తి తనను తక్కువ చేయదని.. అన్యాయానికి ఎదురు నిలవడానికి ధైర్యం ఉంటే చాలని ఆమె పోరాటం చూపించింది. తెలంగాణలో రైతాంగ ఉద్యమం విస్తరించిన కొద్దీ దొరల గడీలపై ప్రజల భయం తగ్గింది. ప్రశ్నించే ధైర్యం పెరిగింది. ఆ మార్పులో ఐలమ్మలాంటి మహిళల పోరాటాలకు ప్రత్యేక స్థానం దక్కింది. ఆమె పేరు ఒక వ్యక్తి పేరుగా కాకుండా.. ప్రజా ప్రతిఘటనకు ప్రతీకగా మారింది.
నేటి తరానికి ఐలమ్మ స్ఫూర్తి.. కొత్త సమస్యలపై కొత్త పోరాటాలు
ఐలమ్మ పోరాటాన్ని కేవలం గతానికి సంబంధించిన చరిత్రగా చూడలేం. కాలం మారింది. పాలన మారింది. దోపిడీ రూపాలు కూడా మారాయి. అయితే సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కొత్త రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి సమాజ అవసరాలకు అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. నేడు విద్య కోసం.. వైద్యం కోసం.. ఉపాధి, ఉద్యోగాల కోసం.. సామాజిక భద్రత కోసం.. సమాన అవకాశాల కోసం ప్రజలు తమ హక్కులను తెలుసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఐలమ్మ కాలంలో దోపిడీ దొర, గడి, వెట్టి, భూమి ఆక్రమణ వంటి రూపాల్లో కనిపించేది. నేడు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక అసమానతలు, వ్యవస్థీకృత దోపిడీ వంటి మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజల్లో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ హక్కులను తెలుసుకోవడం.. పాలకులను ప్రశ్నించడం.. ప్రజా విధానాలను పరిశీలించడం.. ఎన్నికల సమయంలో వచ్చే హామీలు, ప్రలోభాలపై అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడం కూడా కీలకం. ఐలమ్మ స్ఫూర్తి అంటే ఒక వ్యక్తి లేదా ఒక రాజకీయ శక్తి వెనుక నిలబడటం కాదు. ప్రజలు స్వయంగా చైతన్యవంతులై తమ సమస్యలపై సంఘటితంగా ప్రశ్నించడం.. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ హక్కుల కోసం పోరాడటం. పీడిత, అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు అందేలా సమాజంలో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు కేవలం పాలనను చూసే వారిగా కాకుండా.. పాలనను ప్రశ్నించే వారిగా, నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములుగా ఎదగాలనే సందేశాన్ని ఐలమ్మ జీవితం అందిస్తుంది. నేడు ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా.. ఆమె పోరాటం వెనుక ఉన్న అసలు ప్రశ్నలను గుర్తుచేసుకోవాలి. శ్రమకు తగిన గౌరవం ఉందా? పేదలకు న్యాయం జరుగుతోందా? మహిళలకు సమాన గౌరవం లభిస్తుందా? యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయా? విద్య, వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా? ప్రజలు పాలనను ప్రశ్నించేంతగా చైతన్యవంతులుగా ఉన్నారా? అనే ప్రశ్నలు నేటికీ సమాజం ముందున్నాయి. కిష్టాపురంలో సామాన్య కుటుంబంలో పుట్టి.. పాలకుర్తిలో కులవృత్తి చేస్తూ జీవించి.. తన కష్టంతో భూమిని సాగు చేసి.. అన్యాయం ఎదురైనప్పుడు మాత్రం దొరతనానికి తలవంచని యోధురాలు చాకలి ఐలమ్మ. ఆమె పోరాటం ఒక కుటుంబ సమస్యను దాటి.. రైతాంగ చైతన్యంగా మారింది. ఒక మహిళ ధిక్కారం.. అనేక మందికి ధైర్యంగా మారింది. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మహిళ.. తెలంగాణ చరిత్రలో అసామాన్య స్థానాన్ని సంపాదించింది. భూమి కోసం పోరాడింది.. భుక్తి కోసం నిలబడింది.. వెట్టికి వ్యతిరేకంగా గళమెత్తింది.. దొరతనాన్ని ప్రశ్నించింది.. మహిళా ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.. ప్రజా చైతన్యానికి స్ఫూర్తిగా మారింది.. అందుకే చాకలి ఐలమ్మ పేరు తెలంగాణ చరిత్రలో ఒక పేరు మాత్రమే కాదు.. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యానికి, ఆత్మగౌరవంతో నిలబడే స్ఫూర్తికి, ప్రజల హక్కుల కోసం పోరాడే చైతన్యానికి ప్రతీకగా నిలిచింది.ఆమె జీవితం చెప్పే సందేశం ఒక్కటే..
“అన్యాయానికి తలవంచొద్దు.. హక్కుల కోసం ప్రశ్నించు.. శ్రమకు గౌరవం కోరుకో.. ఆత్మగౌరవంతో నిలబడు.. ప్రజల కోసం పోరాడు..”స్టోరీ రచయిత

జీడీ అభిషేక్
పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ. ఎంఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం
