“పని చేయని నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు : కడియం శ్రీహరి”
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు26 ఏప్రిల్, 202608:06 AM

ధర్మసాగర్, ఏప్రిల్ 26 ప్రజాధ్వని :
అవకాశం వచ్చినప్పుడు పనిచేయని వారు, కాలయాపన చేసిన వారు, ప్రజలను పట్టించుకోని వారు నియోజకవర్గ అభివృద్ధిని ఎలా సాధిస్తారో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తాగి తందనాలు ఆడుతూ ప్రజా సమస్యలను విస్మరించిన నాయకత్వంతో అభివృద్ధి సాధ్యం కాదని ఆయన విమర్శించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఏలకుర్తి, రామన్నగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాల కాంపౌండ్ గోడల పనులు ప్రారంభించి, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఐకెపి ప్రగతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎప్పుడూ నీతిపరంగా, నిజాయితీగా పనిచేశానని తెలిపారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకున్నానని, వ్యక్తిగత లాభం కోసం పనిచేసి ఉంటే మరింత సంపాదించేవాడినని అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా చేత కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సెక్రటరీ రాజిరెడ్డి, కార్యాలయ సిబ్బంది, మాజీ పాలకవర్గ సభ్యులు అలాగే ఎంపీడీవో అనిల్ కుమార్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, డీఈపీఆర్ శ్రీనివాసరావు, ఏఈ హౌసింగ్ శ్రీజ, ఏఈపీఆర్ నిఖిల్, సర్పంచ్ నరిశెట్టి సుధాకర్, సీసీ కవిత, ప్రగతి గ్రామైక్య సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు స్వరూప, రజిత, వివో ఏ ఉమాదేవి, మండల ప్రముఖులు, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.
