ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    సీతాఫల్‌ మండిలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

    • శోభాయాత్ర ప్రారంభించిన మాజీ కార్పొరేటర్‌ శ్యామల హేమ..
    • అమ్మవారి చీర వేలానికి విశేష స్పందన
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు22 అక్టోబర్, 202605:14 AM

    సికింద్రాబాద్‌ పరిధిలోని సీతాఫల్‌ మండి బీదల్‌ బస్తీలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. బీదల్‌ బస్తీ జీహెచ్‌ఎంసీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహ నిమజ్జన శోభాయాత్ర బుధవారం రాత్రి భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా సాగింది.

    సీతాఫల్‌ మండిలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర
    సికింద్రాబాద్‌, అక్టోబరు 21 (ప్రజాధ్వని): సికింద్రాబాద్‌ పరిధిలోని సీతాఫల్‌ మండి బీదల్‌ బస్తీలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. బీదల్‌ బస్తీ జీహెచ్‌ఎంసీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహ నిమజ్జన శోభాయాత్ర బుధవారం రాత్రి భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. జీహెచ్‌ఎంసీ మాజీ కార్పొరేటర్‌ శ్యామల హేమ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో రోజుకో అలంకరణలో దుర్గామాత భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారికి అలంకరించిన వస్త్రాల వేలం నిర్వహించగా భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా సరస్వతీదేవి అలంకరణకు ఉపయోగించిన చీరను దక్కించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అమ్మవారి వస్త్రాలను ఇంట్లో ఉంచుకుంటే సకల ఐశ్వర్యాలు, విద్యా విజ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా వేలంలో చీరను దక్కించుకున్న భక్తుడు మాట్లాడుతూ..
    సీతాఫల్‌ మండిలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర - అదనపు చిత్రం 1
    సరస్వతీ మాత ఆశీస్సులతో తన కుమారులు విద్య, వ్యాపార రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, పట్టణం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతోనే ఈ వస్త్రాన్ని పొందే భాగ్యం కలిగిందని, దీనిని డబ్బుతో కొనుగోలు చేసిన వస్తువుగా కాకుండా అమ్మవారి ఆశీస్సులుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ చీరను తన పిల్లలకు అందించడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులోనూ ధార్మిక కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని దుర్గామాత ఆలయ అభివృద్ధికి, వచ్చే ఏడాది నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు వినియోగించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. అనంతరం నిర్వహించిన నిమజ్జన శోభాయాత్రతో సీతాఫల్‌ మండి ప్రాంతం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి నామస్మరణతో సందడి చేశారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు పోలీసులు, స్థానిక పెద్దలు, పట్టణవాసులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: