సోలార్ ప్లాంట్లతో రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం
- 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు24 సెప్టెంబర్, 202603:20 AM

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబరు 23 ప్రజాధ్వని: రైతులు సంప్రదాయ పంటల సాగుతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను సద్వినియోగం చేసుకుంటూ సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం రంగరాయగూడెం గ్రామంలో ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద స్థానిక రైతు నెలమంచ అజయ్‌రెడ్డి ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్లాంట్‌ను ప్రారంభించిన ఆయన.. సౌర విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు.

అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణహిత ఇంధనం, సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. బంజరు భూములు, తక్కువ సాగు విస్తీర్ణం ఉన్న ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్‌ను సంస్థలకు విక్రయించి రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి పెరగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన రైతు అజయ్‌రెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. రైతులు కూడా ఇలాంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
