ఎస్‌ఐఆర్ రెండో విడతపై బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు24 ఆగస్టు, 202612:25 PM

స్టేషన్‌ఘన్‌పూర్ ఆగష్టు 24 ప్రజాధ్వని: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు సవరణ) రెండో విడత సమావేశం సోమవారం నిర్వహించారు. జనగామ జిల్లా ఎస్‌ఐఆర్ అభియాన్ కన్వీనర్ బొజ్జపల్లి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సౌడ రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపుతో దేశ పురోగతిలో భాగంగా భారతీయ పౌరులందరికీ సమానమైన ఓటుహక్కు కల్పించే లక్ష్యంతో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ ఎస్‌ఐఆర్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, బీజేపీ బీఎల్‌ఏ–2లు ఓటర్ల వద్దకు వెళ్లాలని సూచించారు. అర్హులైన నూతన ఓటర్ల నమోదుకు ఫారం–6, అనర్హులైన వారి పేర్ల తొలగింపునకు ఫారం–7, చిరునామా మార్పు కోసం ఫారం–8 ద్వారా దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా ప్రతి బీజేపీ కార్యకర్త తప్పక హాజరై విజయవంతం చేయాలని రమేష్ కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఊడుగుల రమేష్, బల్ల శ్రీనివాస్, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ మండల అధ్యక్షులు సట్ల వెంకటరమణ, గంటే ఉపేందర్ యాదవ్, పుప్పాల వేణు, బైరపాక కుమార్‌తో పాటు అమరేందర్‌రెడ్డి, దుర్గాప్రసాద్, సందీప్, జగదీష్, రాజేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
