ఏడాదైనా పూర్తికాని ఖిలాషాపురం–నిడికొండ రహదారి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు26 జూన్, 202606:45 AM

రఘునాథపల్లి, జూన్ 26 ప్రజాధ్వని : రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం నుంచి నిడికొండ వరకు సుమారు రూ.6 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులు ప్రారంభమై ఏడాది గడిచినా ఇంకా పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రఘునాథపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఉడుత రంజిత్ యాదవ్ విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినప్పటికీ పనుల్లో ఆశించిన వేగం కనిపించడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ప్రస్తుతం రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డంతా గుంతలమయంగా మారడంతో ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఎండాకాలంలో దుమ్ము, వర్షాకాలంలో బురదతో ప్రయాణం మరింత దుర్భరంగా మారుతోందని పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని రంజిత్ యాదవ్ అన్నారు. వర్షాల సమయంలో రహదారిపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని, గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ దెబ్బతింటోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర సేవల వాహనాలు సకాలంలో గ్రామాలకు చేరుకోవడం కూడా కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, గ్రామీణ అభివృద్ధికి రహదారులే ప్రధాన ఆధారమని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి రహదారి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గ్రామస్థులు కూడా వెంటనే పనులు పూర్తి చేసి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
