ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    వివాహిత అనుమానాస్పద మృతి.. హత్య చేసి ఉరివేశారంటూ బంధువుల ఆరోపణ

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు2 అక్టోబర్, 202604:09 PM
    వివాహిత అనుమానాస్పద మృతి.. హత్య చేసి ఉరివేశారంటూ బంధువుల ఆరోపణ
    రాయపర్తి, అక్టోబర్‌ 2 (ప్రజాధ్వని): వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కొలనుపల్లిలో వివాహిత గాజుల దివ్య (24) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దివ్య ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో మృతిచెందినట్లు సమాచారం. అయితే ఆమెను హత్య చేసి ఉరివేసినట్లు మృతురాలి పుట్టింటి బంధువులు ఆరోపిస్తున్నారు. జఫర్ఘడ్ మండలం ఓబులాపూర్‌కు చెందిన దివ్యకు కొలనుపల్లికి చెందిన గాజుల సురేష్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైనట్లు సమాచారం. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరిలో తొమ్మిది నెలల చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కుటుంబపరమైన విభేదాలు ఉన్నట్లు బంధువులు, స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో దివ్య మృతిచెందడంతో ఆమె పుట్టింటి బంధువులు కొలనుపల్లికి చేరుకున్నారు. దివ్య మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఆమెను హత్య చేసి ఉరివేసినట్లు ఆరోపించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

    బంధువుల ఆందోళన.. గ్రామంలో ఉద్రిక్తత

    దివ్య మృతితో ఆగ్రహానికి గురైన బంధువులు గ్రామంలో ఆందోళనకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కొలనుపల్లికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దివ్య మృతికి అసలు కారణం ఏమిటి? ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేక హత్య చేసి ఉరివేశారా? అనే విషయాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
    మీ స్పందన:

    షేర్ చేయండి: