నెల్లుట్లలో రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు13 ఏప్రిల్, 202610:12 AM

నెల్లుట్ల, ఏప్రిల్ 13 ప్రజాధ్వని : 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్ భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం నెల్లుట్ల గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు.

హెల్మెట్ లేకుండా వాహనాలు నడపకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ప్రమాణిత (బ్రాండెడ్) హెల్మెట్లు ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ పట్టణ మురుగు నీరు నెల్లుట్ల చెరువులోకి చేరకుండా ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి పంపించాలని, చెరువులో పూడిక తొలగించాలని కోరారు. అలాగే పోచమ్మ గుడి రహదారిని పునరుద్ధరించాలని, గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న మద్యం దుకాణాలను నిబంధనల ప్రకారం గ్రామానికి దూరంగా తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై స్పందించిన కలెక్టర్, సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పోచమ్మ గుడి రహదారిని కాలినడకన పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

