తిరుమలాయపల్లి గ్రామంలో బొడ్డెమ్మ వేడుకల్లో మహిళల సందడి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు6 అక్టోబర్, 202603:10 PM

రాయపర్తి, అక్టోబర్ 6, ప్రజాధ్వని: బొడ్డెమ్మ పండుగ సందర్భంగా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో సోమవారం రాత్రి మహిళలు సందడి చేశారు. రంగురంగుల పూలతో బొడ్డెమ్మను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొడ్డెమ్మ చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల ఆటపాటలు, కేరింతలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, యువతులు సైతం వేడుకల్లో పాల్గొని సంప్రదాయ పాటలు, ఆటలను నేర్చుకున్నారు. నేటి ఆధునిక కాలంలోనూ తెలంగాణ పల్లె సంప్రదాయాలను కొనసాగిస్తూ బొడ్డెమ్మ వేడుకలను నిర్వహించడం పలువురిని ఆకట్టుకుంది. బతుకమ్మకు ముందు నిర్వహించే బొడ్డెమ్మ వేడుకలు తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని మహిళలు పేర్కొన్నారు. ఈ వేడుకల ద్వారా భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలు పరిచయం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో కుక్కల సరిత, మేరుగు మంజుల, గజవెల్లి జ్యోతి, రమ్య, దోకుడు సంధ్యారాణి, సుధాగాని రమ్య, మిల్కీ తదితరులు పాల్గొన్నారు.
