ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    ఇందిరమ్మ ఇళ్లపై నిరాధార ఆరోపణలు సిగ్గుచేటు_సర్పంచ్‌ మండపురం రాణి–అనిల్‌ గౌడ్‌

    • ఉనికి కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శ
    • ఇప్పగూడెం అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు29 సెప్టెంబర్, 202601:36 PM
    ఇందిరమ్మ ఇళ్లపై నిరాధార ఆరోపణలు సిగ్గుచేటు_సర్పంచ్‌ మండపురం రాణి–అనిల్‌ గౌడ్‌
    స్టేషన్‌ ఘన్‌పూర్‌, సెప్టెంబర్‌ 29 ప్రజాధ్వని: మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇందిరమ్మ ఇళ్లపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, ఇకనైనా కారుకూతలు మానుకోవాలని ఇప్పగూడెం గ్రామ సర్పంచ్‌ మండపురం రాణి–అనిల్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం ఇప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకున్నారంటూ రాజయ్య చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దమ్ముంటే నిరూపించాలని సవాల్‌ చేశారు. ఆరోపణలపై చిత్తశుద్ధి ఉంటే గ్రామానికి వచ్చి లబ్ధిదారుల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధపడాలని అన్నారు. లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే ప్రజా శిక్షకు సిద్ధమని, ఆరోపణలు నిరూపించలేకపోతే రాజయ్య రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఇప్పగూడెం గ్రామానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేశారో రాజయ్య వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేని వారు ఇందిరమ్మ ఇళ్లపై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఇప్పగూడెం గ్రామానికి ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి ఏమిటో రాజయ్య చెప్పాలని సర్పంచ్‌ కోరారు. పదవిని అడ్డుపెట్టుకుని పనులు, పదవుల కోసం లంచాలు అడిగిన వ్యక్తులు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆమె విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం రాజయ్య స్థానం ఏమిటో కూడా ప్రజలకు చెప్పాలని అన్నారు. ఇక గ్రామంలో మరో నలుగురు అర్హులైన లబ్ధిదారులకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సాంకేతిక సమస్యలు పరిష్కారమైన వెంటనే వారికి కూడా ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం తగదని రాణి–అనిల్‌ గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో ఇప్పగూడెం గ్రామానికి 94 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, రూ.2.30 కోట్ల సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని ఆమె తెలిపారు. రాజయ్య ఇకనైనా ఆధారాలతో మాట్లాడాలని, నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. సమావేశంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల మల్లయ్య, వార్డు సభ్యులు కత్తుల రాజయ్య, కత్తుల రవి, దైద ఇలేషన్‌, బొంకూరి భిక్షపతి, గొడిశాల యాదగిరి, ఎస్‌.రాములు, పల్లె సత్యనారాయణ, కృష్ణమూర్తి, గట్టు మల్లయ్యతో పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: