జనగామలో డ్రైనేజీ సమస్యపై గ్రామస్తుల ఆవేదన
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు6 మే, 202609:09 AM

జనగాం మే 06 ప్రజాధ్వని :
జనగామ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నెలుట్ల గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ, గ్రామ పెద్దలతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన డ్రైనేజీ సమస్యను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. గత దశాబ్ద కాలంగా జనగామ పట్టణానికి సంబంధించిన మురికినీటిని నెలుట్ల గ్రామ చెరువులోకి మళ్లించడం వల్ల గ్రామ ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైద్య వ్యర్థాలు, చిరు వ్యాపారుల చెత్తను చెరువు పరిసర ప్రాంతాల్లో వేయడం వల్ల ఆర్టీసీ కాలనీ, శ్రీనివాస్ నగర్, వడ్డెర కాలనీల ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదేవిధంగా, ఈ పరిస్థితి రైతాంగానికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని, చెరువు నీరు కాలుష్యం చెందడం వల్ల పంటలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కావున తక్షణమే చెరువులోకి మురికినీరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, లేకపోతే సివరేజ్ శుద్ధి కేంద్రం (సివరేజ్ ప్లాంట్) ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీరే చెరువులోకి విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశంపై మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వీడీసీ చైర్మన్ బత్తిని అశోక్ గౌడ్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ గుర్రం బాలరాజు, నాయకులు జెగ్గం ఆనంద్, జిగురు ఉపేందర్, కొత్తకొండ గంగాధర్, యేనగందుల భాస్కర్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
