● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
స్టేషన్ ఘనపూర్/జనగాం
కడియం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల ఫైర్
రాజయ్య జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త..
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో బెదిరింపులా?
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు23 సెప్టెంబర్, 202611:45 AM
సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు
స్టేషన్ ఘన్పూర్ సెప్టెంబర్ 23 ప్రజాధ్వని: మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. రాజయ్యను విమర్శించడం మానుకోవాలని, లేదంటే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ‘‘రాజయ్య జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త’’ అంటూ బీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ హెచ్చరించారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాచర్ల గణేష్, పల్లెపాటి జైపాల్‌రెడ్డి, చౌదరపల్లి శేఖర్, కనకం గణేష్ తదితరులు మాట్లాడారు.
పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను విమర్శించడం సరికాదని వారు అన్నారు. రాజయ్య కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం నియోజకవర్గ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. కుటుంబంలో వైద్యులు ఉన్నప్పటికీ సొంత ఆసుపత్రి నిర్మించుకోకుండా ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా రాజయ్య పనిచేశారని మాచర్ల గణేష్ అన్నారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటులో కీలక పాత్ర
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటులో రాజయ్య కీలక పాత్ర పోషించారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఆ విషయంలో తన ఉప ముఖ్యమంత్రి పదవిని సైతం కోల్పోయారని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాజయ్యకు రాజకీయ పునర్జన్మ లభించిందని, అయితే కడియం శ్రీహరి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం తనకు రాజకీయంగా అవకాశం కల్పించిన కేసీఆర్‌ను, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారని ఆరోపించారు. తన కుమార్తె రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారారని విమర్శించారు. కాలుకు బలపం కట్టుకుని గ్రామగ్రామం తిరుగుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కడియం శ్రీహరిని గెలిపించడంలో రాజయ్య కీలకంగా పనిచేశారని అన్నారు.
ఏడు రిజర్వాయర్లకు రాజయ్య కృషి
2004లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఒక్క రిజర్వాయర్ కూడా ఉందా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దేవాదుల ప్రాజెక్టుకు పునాదులు పడగా, అనంతరం ఏడు రిజర్వాయర్లను పూర్తి చేసి ప్రారంభించిన ఘనత రాజయ్యదేనని పేర్కొన్నారు. లింగంపల్లి ప్రాజెక్టు పేరుతో నాలుగు గ్రామాలను ముంపునకు గురిచేసి, హనుమకొండలో ఇళ్లు నిర్మించుకున్నారంటూ కడియం శ్రీహరిపై వారు ఆరోపణలు చేశారు.
జీవో 97 రద్దు చేయాలి
నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పుకోవడం కాదని, దమ్ముంటే జీవో నంబర్ 97ను రద్దు చేయాలని కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు. గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంజూరు చేయించిన ఇరిగేషన్ పనులకు రీ ఎస్టిమేషన్లు వేయించి, వాటిని తాము చేపట్టిన పనులుగా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. పదేపదే కుటుంబ సభ్యుల ఆస్తుల గురించి మాట్లాడుతున్న కడియం శ్రీహరి.. తన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. అభివృద్ధిపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను కేసులతో బెదిరించడం కడియంకు అలవాటుగా మారిందని ఆరోపించారు. కేసులు తమకు కొత్త కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో జైళ్లకు వెళ్లిన చరిత్ర తమకుందని అన్నారు.
కడియంను ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి మేమే సిగ్గుపడుతున్నాం
‘‘ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అని చెప్పుకుంటే సిగ్గుపడుతున్నాం’’ అంటూ కడియం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తూ. ‘‘మేము గెలిపించిన తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లిన కడియం శ్రీహరిని ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికి మేమే సిగ్గుపడుతున్నాం’’ అని ప్రతిస్పందించారు. ద్వితీయ శ్రేణి నాయకులతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాజయ్యపై విమర్శలు చేయించడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు, చిన్నాచితకా నాయకులు ఇకపై రాజయ్యను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఎంజీఎం ఘటనపై ఆగ్రహం
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడి రోగులు ఇబ్బందులు పడుతున్న అంశాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నాయకులను పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల్లో ఉన్న ప్రశ్నలను పక్కదారి పట్టించేందుకే ప్రతిపక్షాలపై కేసులు, ఆంక్షలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
మున్సిపాలిటీ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి_ కనకం గణేష్
స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీకి ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు వచ్చాయి? ఏయే పనులకు ఎంత ఖర్చు చేశారు? అనే వివరాలను బహిర్గతం చేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రతి వార్డు కౌన్సిలర్‌తో సమావేశం నిర్వహించి ఆయా వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, భవిష్యత్‌లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులు మాచర్ల గణేష్, జఫర్‌గఢ్ మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి జయపాల్‌రెడ్డి, లింగాలఘణపూర్ మండల పార్టీ అధ్యక్షుడు చౌదరపల్లి శేఖర్, కౌన్సిలర్ల తాటికొండ మధు, బాలగాని అనిల్, పొన్న రాజేష్, చల్ల రమ్య - రఘురెడ్డి మున్సిపల్ కన్వీనర్ కనకం గణేష్, మాజీ వైస్ చైర్మన్ చల్ల చందర్ రెడ్డి, నాయకులు శీలం శ్యామ్, మారేపల్లి ప్రసాద్, గుండె మల్లేష్,కుంభం కుమార స్వామి, చింత శ్రీను, ఆకారపు అశోక్,చిట్టిబాబు హీరా సింగ్, సోషల్ మీడియా ఇంచార్జ్ గట్టు కృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు.