జఫర్గడ్లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు7 ఏప్రిల్, 202606:23 AM

జఫర్గడ్, ఏప్రిల్ 7 ప్రజాధ్వని: జఫర్గడ్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 20 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి కింద చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే సీఎంఆర్ఎఫ్ ద్వారా 45 మందికి రూ.13.29 లక్షలు అందజేసినట్లు చెప్పారు. మొత్తం 65 మందికి సుమారు రూ.43 లక్షలకు పైగా ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సర్పంచ్లు, అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో సుమారు 2,500 ఇళ్లు మంజూరై రూ.175 కోట్ల వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తైందని, చాలా మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సహాయంతో పాటు స్వంతంగా అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకుంటున్నారని తెలిపారు. మే 31, 2026లోపు అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని గడువు విధించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే గృహ ప్రవేశాలు జరగాలని సూచించారు. లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ అధికారులు, ఎంపీడీవోలకు సూచించారు. ప్రారంభించని ఇళ్లను రద్దు చేసి అర్హులైన ఇతరులకు కేటాయిస్తామని హెచ్చరించారు.

రైతులకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఐకేపీ కేంద్రాలను సర్పంచ్లు ముందుండి ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, డ్రోన్లు వంటి పరికరాలు అందిస్తున్నదని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద సంవత్సరానికి రెండు సార్లు ఎకరానికి రూ.12,000 ఇస్తోందని, పంట రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నదని వివరించారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పాలకులు వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుని రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా రూ.6,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు అప్పుల వాయిదాలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్లు ప్రజలతో సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎవరు ఏ పార్టీకి చెందిన వారైనా సరే ప్రభుత్వ సహాయం అందించడంలో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

