మార్కెట్లో మోసాలు... దళారులతో అధికారుల దోస్తీ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు6 ఏప్రిల్, 202608:23 AM

స్టేషన్ ఘనపూర్ ఏప్రిల్ 06 ప్రజాధ్వని :
రైతే రాజు అని గొప్పగా చెప్పుకునే మన సమాజంలో, ఆ అన్నదాతే ఇబ్బందుల్లో కూరుకుపోయిన దుస్థితి మరోసారి బయటపడింది. స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతులకు ఉపశమనం కలిగించాల్సింది పోయి, వారి ఆవేదనకు కేంద్రబిందువుగా మారింది. ఎండలను తట్టుకుని, అప్పులు చేసి, విత్తనాలు కొనుగోలు చేసి, నీళ్లు పట్టి, ఎరువులు వేస్తూ నెలల తరబడి కష్టపడిన రైతులు చివరకు తమ పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు చేరుకున్నారు. కానీ అక్కడ వారికి ఎదురవుతున్నది ఆశ కాదు... నిరాశే. వారం పది రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది.

కొనుగోలు కేంద్రంలో అధికారులు తేమశాతం ఎక్కువగా ఉందని, ఫంగస్ ఉందని, నాణ్యత సరిగా లేదని వివిధ కారణాలు చెబుతూ మొక్కజొన్నను తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే పంటను మధ్యవర్తులు (దళారులు) తక్కువ ధరలకు కొనుగోలు చేసి, అదే కేంద్రంలో విక్రయించేందుకు మార్గం సుగమం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. “మేము అప్పులు చేసి పంట పండించాం. రోజూ మార్కెట్ చుట్టూ తిరుగుతున్నాం. కానీ మా మొక్కజొన్నను తీసుకోవడం లేదు. అదే దళారులది మాత్రం తీసుకుంటున్నారు. ఇది ఎలాంటి న్యాయం?” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడమే కాకుండా, దాన్ని అమ్ముకునే దశలోనూ ఇలాంటి అవమానాలు ఎదురవుతుండటంతో రైతుల మనసులు ముక్కలవుతున్నాయి. కొందరు రైతులు అప్పుల బారం తట్టుకోలేక మానసికంగా కుంగిపోతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, దళారుల ప్రయోజనాలకు పనిచేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి, కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టి, రైతులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

