పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య
- పుస్తకం మనిషికి జీవితాంతం తోడుండే మంచి నేస్తం.. యువత పఠనాన్ని అలవర్చుకోవాలి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు7 నవంబర్, 202612:31 PM
జాతీయ పుస్తక వారోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని అశోక కాంప్లెక్స్‌లో నవచేతన బుక్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

హనుమకొండ, నవంబర్ 7 ప్రజాధ్వని : జాతీయ పుస్తక వారోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని అశోక కాంప్లెక్స్‌లో నవచేతన బుక్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుస్తకం మనిషికి మంచి నేస్తమని, జీవితాంతం జ్ఞానాన్ని అందించే విలువైన సంపద అని పేర్కొన్నారు. పుస్తక పఠనంతో విజ్ఞానం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెంపొందుతాయని, సమాజంపై అవగాహనతో పాటు జీవితాన్ని చూసే దృక్పథం మెరుగుపడుతుందని అన్నారు.

డిజిటల్ యుగంలో సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగినప్పటికీ పుస్తక పఠనానికి ఉన్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ప్రతిరోజూ కొంత సమయాన్ని పుస్తకాలు చదివేందుకు కేటాయించాలని సూచించారు. పుస్తకాలు విజ్ఞానాన్ని అందించడమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని వివరించారు. తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు నేర్పించాలని, ప్రతి ఒక్కరూ పఠనాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

పఠనాసక్తిని పెంపొందించేందుకు పుస్తక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని, రచయితలు, సాహితీవేత్తలు, పాఠకులకు ఇలాంటి కార్యక్రమాలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. ప్రదర్శనను ఏర్పాటు చేసిన నవచేతన బుక్ హౌస్ నిర్వాహకులను అభినందించారు. అనంతరం ప్రదర్శనలోని వివిధ విభాగాలను సందర్శించి పలు రకాల పుస్తకాలను పరిశీలించడంతో పాటు తనకు నచ్చిన పుస్తకాలను స్వయంగా కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, సీనియర్ జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి, గడ్డం రాజిరెడ్డి, వల్లాల వెంకటరమణ, వేణుమాధవ్, తోట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
