అభివృద్ధిపై బీఆర్‌ఎస్ విమర్శలకు కాంగ్రెస్ నేతల కౌంటర్
- స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని వెల్లడి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు24 సెప్టెంబర్, 202607:31 AM

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 24 ప్రజాధ్వని:
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో చేసిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజల ముందే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

తేదీలతోనే సమాధానం చెప్పాలి: చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్
స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల, మున్సిపాలిటీ ఏర్పాటు వంటి అంశాలను కొందరు బీఆర్‌ఎస్ నాయకులు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదన్నారు. ఆయా పనులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, మంజూరు తేదీలను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టమవుతాయని చెప్పారు. 100 పడకల ఆస్పత్రికి సంబంధించిన జీఓ 2025లో మంజూరైందని, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రి కోసం నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషి చేశారని తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన స్థలాన్ని ఇతర శాఖకు బదలాయించేందుకు 2024 నవంబర్‌లో చర్యలు జరిగాయని చెప్పారు. అదేవిధంగా స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఏర్పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. డిగ్రీ కళాశాలకు సంబంధించిన మంజూరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉన్న తేదీలను ప్రజల ముందుంచితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు విషయంలోనూ చరిత్రను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. 2001లో దేవాదుల ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరిగిందని, ఆ సమయంలో కడియం శ్రీహరి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. 2009లో డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని పేర్కొంటూ.. ప్రాజెక్టు చరిత్రను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా చెప్పడం సరికాదన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి జరగడం లేదని విమర్శలు చేస్తున్నవారు క్షేత్రస్థాయిలో పర్యటించి చూడాలని సూచించారు. ఇందిరానగర్, మోడల్ కాలనీ, డంపింగ్ యార్డు తదితర ప్రాంతాల్లో గతంలో ఉన్న పరిస్థితులకు, ప్రస్తుతం జరిగిన అభివృద్ధికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ద్వారా రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, మొత్తం 25 పనులకు అనుమతులు రాగా 16 పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. వాటి అంచనా వ్యయం సుమారు రూ.32.32 కోట్లు అని వివరించారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.
రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు: జూలూకుంట్ల శిరీష్‌రెడ్డి
కాంగ్రెస్ మండల అధ్యక్షులు జూలూకుంట్ల శిరీష్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని గతంలో చెప్పిన నాయకులు ఇప్పుడు చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ కడియం కావ్యకు నియోజకవర్గ ప్రజలు 50 వేలకుపైగా మెజారిటీ అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూడాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, మహిళా భవనాలు, కమ్యూనిటీ హాళ్లు తదితర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేయడం వల్ల నియోజకవర్గానికి ప్రయోజనం ఉండదన్నారు. 100 పడకల ఆస్పత్రి నిర్మాణం పురోగతిలో ఉందని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించిన తర్వాతే మాట్లాడాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే ప్రజల్లోనే వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
