ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    తెలంగాణ

    అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!

    • యమద్వితీయ.. భాతృవిదియ వేడుకలు
    • అన్నదమ్ముల ఆయురారోగ్యాల కోసం అక్కాచెల్లెళ్ల ప్రత్యేక పూజలు
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు12 నవంబర్, 202602:33 AM

    భారతీయ సంస్కృతిలో కుటుంబ బంధాలకు, రక్తసంబంధాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ఆప్యాయత, అనురాగం, ఆత్మీయతను తరతరాల పాటు నిలిపేలా మన పెద్దలు ఎన్నో సంప్రదాయాలను ఆచరణలోకి తీసుకొచ్చారు.

    అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
    భారతీయ సంస్కృతిలో కుటుంబ బంధాలకు, రక్తసంబంధాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ఆప్యాయత, అనురాగం, ఆత్మీయతను తరతరాల పాటు నిలిపేలా మన పెద్దలు ఎన్నో సంప్రదాయాలను ఆచరణలోకి తీసుకొచ్చారు. అలాంటి మధురమైన సంప్రదాయాల్లో ఒకటే భగినీ హస్త భోజనం. దీన్నే యమద్వితీయ, భాతృవిదియ అని కూడా పిలుస్తారు. దీపావళి పండుగ అనంతరం రెండో రోజున జరుపుకునే ఈ పర్వదినం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది.

    యమధర్మరాజు.. యమునల అనుబంధమే ఈ పండుగకు మూలం!

    పురాణాల ప్రకారం సూర్యభగవానుడికి యమధర్మరాజు, యమున అనే ఇద్దరు సంతానం. యమునకు తన అన్న యమధర్మరాజు అంటే ఎంతో అభిమానం. అయితే యమలోక బాధ్యతలతో నిత్యం బిజీగా ఉండే అన్నయ్య తన ఇంటికి రావడం లేదని ఆమె మనసులో బాధపడేది. దీంతో ఒకరోజు గంగానది ద్వారా తన అన్నయ్యకు ఆహ్వానం పంపించింది. చెల్లెలి ఆహ్వానాన్ని మన్నించిన యమధర్మరాజు ఆమె ఇంటికి చేరుకున్నాడు. యమున సాదరంగా స్వాగతం పలికి, ప్రేమతో వంటలు వండి కడుపునిండా భోజనం పెట్టింది. చెల్లెలి ఆతిథ్యానికి మురిసిపోయిన యముడు ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. అందుకు యమున ప్రతి సంవత్సరం ఇదే రోజున తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని కోరింది. అందుకు యముడు అంగీకరించడమే కాకుండా, ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసే సోదరులకు అకాల మృత్యుభయం ఉండదని వరమిచ్చినట్లు పురాణగాథ చెబుతోంది. దీంతో ఈ పర్వదినానికి యమద్వితీయ అనే పేరు వచ్చిందని ప్రతీతి.

    సోదరి ఇంటి భోజనం.. సోదరుడికి ఆశీస్సుల కానుక!

    మరో పురాణగాథ ప్రకారం నరకాసురుడిని సంహరించి తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడిని ఆయన సోదరి సుభద్ర ఇదే రోజున సాదరంగా ఆహ్వానించి, తిలకం దిద్ది స్వాగతం పలికిందని చెబుతారు. ఈ సంఘటన కూడా భాతృవిదియ సంప్రదాయానికి మరో ఆధారంగా ప్రాచుర్యంలో ఉంది. వివాహం అనంతరం ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్లడంతో పుట్టింటితో గడిపే సమయం తగ్గిపోతుంది. అన్నదమ్ములు తమ సోదరీమణుల ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించాలని భావించినా, కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిళ్ల కారణంగా ప్రతిసారీ అది సాధ్యపడదు. సోదరుడికి తన చేతి వంటతో భోజనం పెట్టాలనే చెల్లెలి కోరిక, సోదరి కాపురాన్ని చూసి ఆశీర్వదించాలనే అన్నయ్య ఆకాంక్షకు ఈ పండుగ ఒక చక్కని వేదికగా నిలుస్తోంది. అందుకే భగినీ హస్త భోజనానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది.

    ఉత్తరాదిలో ఘనంగా వేడుకలు.. నేపాల్‌లోనూ ప్రత్యేక గుర్తింపు!

    దక్షిణ భారతదేశంలో ఈ పండుగను కొంత పరిమితంగా జరుపుకున్నప్పటికీ, ఉత్తర భారతదేశంలో మాత్రం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. భాయిదూజ్‌, భాయిటీకా, భాయితిహార్‌ వంటి పేర్లతో ఈ పండుగను పిలుస్తారు. నేపాల్‌లోనూ దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి, నుదుటిపై తిలకం దిద్ది హారతి ఇస్తారు. నేపాల్‌లో సంప్రదాయం ప్రకారం ఏడు రంగులతో ప్రత్యేక తిలకం ధరిస్తారు. అనంతరం సోదరులకు ఇష్టమైన వంటకాలను ప్రేమగా వడ్డిస్తారు. సోదరులు సైతం తమ సోదరీమణులకు బహుమతులు అందించి, వారి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ఆశీర్వదిస్తారు. కేవలం పూజలు, ఆచారాలకే పరిమితం కాకుండా కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని తగ్గించి, ఆత్మీయతను పెంచడమే ఈ పండుగ అసలు ఉద్దేశం. బిజీ జీవితంలో బంధువులను కలుసుకోవడానికి సమయం కేటాయించలేని నేటి తరానికి ఈ సంప్రదాయం ఒక చక్కని సందేశాన్ని అందిస్తోంది. అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగాన్ని మరోసారి గుర్తుచేస్తూ, కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే భగినీ హస్త భోజనం నిజంగా భారతీయ సంస్కృతి అందించిన అపురూపమైన కానుకే!
    మీ స్పందన:

    షేర్ చేయండి: