ఈ వర్షాకాలంలోనే సాగు నీరు అందాలి_ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు19 మే, 202610:30 AM

స్టేషన్ ఘనపూర్, చిల్పూర్ : మే 19 ప్రజాధ్వని చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో గండి రామారం ఎత్తిపోతల పథకంలోని లిఫ్ట్–1 పంపు హౌస్ నిర్మాణ పనులను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు మందకొడిగా సాగుతున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “సబ్ స్టేషన్ లేకుండా పంపు హౌస్ ఎలా పని చేస్తుంది? నీటిని ఎలా లిఫ్ట్ చేస్తారు?” అంటూ అధికారులను ప్రశ్నించారు. పంపు హౌస్ నిర్మాణంతో పాటు సబ్ స్టేషన్ పనులు సమాంతరంగా చేపట్టాల్సిన అవసరం తెలియదా అని నిలదీశారు. జూన్ 30లోపు పనులు పూర్తిచేస్తామని సమీక్షలో ఎలా హామీ ఇచ్చారో వివరణ కోరారు. సమస్యలు ముందుగానే తెలియజేయకపోతే పరిష్కారం ఎలా సాధ్యమవుతుందన్నారు. సివిల్ వర్క్, ఎలక్ట్రికల్ పనులు, అప్రోచ్ ఛానల్, పంపింగ్ మోటార్లు, పైప్‌లైన్ పనులన్నీ ఖచ్చితమైన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు పైప్‌లైన్ అనుమతులు, అప్రోచ్ రోడ్, పంపు హౌస్ వద్ద కార్యాలయ గదుల నిర్మాణానికి రెండు రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతులు తీసుకోవాలని సూచించారు.

“నేను నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశాను. సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన ఉంది. అధికారులు, కాంట్రాక్టర్లు కూడా అదే స్థాయిలో బాధ్యతగా పని చేయాలి. జులై 31లోపు లిఫ్ట్–1 పనులు పూర్తి చేసి ఈ వర్షాకాలంలోనే సాగు నీరు అందించాలి” అని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా చిల్పూర్, వేలేరు మండలాలకు సాగు నీరు అందించేందుకు రూ.104 కోట్లతో లిఫ్ట్–1, లిఫ్ట్–2, లిఫ్ట్–3 పనులు చేపట్టగా, లిఫ్ట్–2 ఇప్పటికే పూర్తయ్యిందన్నారు. లిఫ్ట్–1 పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

దేవాదుల కాలువల పూడికతీత, కొత్త కాలువల నిర్మాణంతో నియోజకవర్గంలో దాదాపు 80 శాతం ఆయకట్టుకు గోదావరి జలాలు అందుతున్నాయని తెలిపారు. రూ.146 కోట్లతో ఘనపూర్–నవాబ్‌పేట ప్రధాన కాలువల లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని, దేవాదుల ఫేజ్–3 ప్యాకేజీ–6ను రూ.1015 కోట్ల సవరించిన అంచనాలతో మంజూరు చేయించామని చెప్పారు. ఇందులో నియోజకవర్గ పరిధిలోనే రూ.400 కోట్ల పనులు జరుగుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఈ సీతారాం, ఈఈ ప్రవీణ్, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, చిల్పూర్, మున్సిపాలిటీ చైర్మన్ వినయ్ కుమార్, కౌన్సిలర్లు హరినాథ్, నీల రాజమ్మ గట్టయ్య, పెసరు సారయ్య, పొన్న రాజయ్య, బూర్ల శంకర్, నాగరబోయిన శ్రీరాములు, బెల్దే వెంకన్న, గట్టు రమేష్, బొల్లు లక్ష్మి, తిరుమల స్వామి దేవస్థానం చైర్మన్ నరసింహులు, కిషన్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి సర్పంచులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
