గండి రామారం లిఫ్ట్-1 పనులు వేగవంతం చేయాలి
- జనవరిలో రెండో పంటకు నీరందించాలి:ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు30 సెప్టెంబర్, 202608:38 AM

చిల్పూర్, సెప్టెంబరు 30 ప్రజాధ్వని: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూర్, వేలేరు మండలాల రైతులకు సాగునీరు అందించే గండి రామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్-1 పనులను వేగవంతం చేసి, జనవరిలో రెండో పంటకు నీరు అందించాలని ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో గండి రామారం లిఫ్ట్-1 పంపుహౌస్ నిర్మాణ పనులను నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రూ.104 కోట్లతో చేపట్టిన గండి రామారం ఎత్తిపోతల పథకంలో మూడు లిఫ్టులు ఉన్నాయని తెలిపారు. గత పాలకులు లిఫ్ట్-2 పనులను పూర్తి చేసుకుని తమ భూములకు నీటిని తరలించుకున్నారని, చిల్పూర్, వేలేరు మండలాల రైతులకు ఉపయోగపడే లిఫ్ట్-1, లిఫ్ట్-3 పనులను పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లిఫ్ట్-1 పనులను అధికారులు, కాంట్రాక్టర్ల వెంటపడి చేయిస్తున్నానని, ప్రస్తుతం పనులు 70 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పంపుహౌస్ వద్ద సివిల్, మోటార్లు, ఎలక్ట్రికల్, మెకానికల్ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నవంబరు చివరి నాటికి పైప్‌లైన్ పనులు పూర్తిచేసి, డిసెంబరులో ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలో లిఫ్ట్-1 ద్వారా రైతులకు రెండో పంటకు సాగునీరు అందించాలని స్పష్టం చేశారు.

శాఖల మధ్య సమన్వయం లేకపోతే ఎలా?
పంపుహౌస్ వద్ద ఏ పనులు ఎవరు చేపట్టాలి, సబ్‌స్టేషన్ నిర్మాణం జరుగుతుందా లేదా అనే విషయాలపై అధికారులకే స్పష్టత లేకపోవడంపై కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యలు ఉంటే శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పనులను వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌పై ఉందన్నారు.
ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరే లక్ష్యం
2002లో ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దేవాదుల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్లు కడియం శ్రీహరి తెలిపారు. తాను నాటిన చిన్న మొక్క నేడు మహావృక్షంగా ఎదిగి వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. దేవాదుల ద్వారా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సాగునీరు అందడంతో పచ్చదనం విస్తరించిందని చెప్పారు. గండి రామారం లిఫ్ట్-1 ద్వారా నీరు అందని గ్రామాలకు గౌరవెల్లి వరద కాలువ ద్వారా సాగునీరు అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. త్వరలో గౌరవెల్లి రిజర్వాయర్ పరిధి అధికారులతో సమావేశం నిర్వహించి ఈ దిశగా చర్యలు చేపడతానని తెలిపారు. దేవాదులపై అవగాహన లేకుండా కొందరు విమర్శలు చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు రెండు పంటలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. దేవాదుల పెండింగ్ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నియోజకవర్గ రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల ప్రయోజనాల కోసం చేపడుతున్న కాలువలు, పైప్‌లైన్లు, విద్యుత్ స్తంభాల పనులకు రైతులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, ఈఈ ప్రవీణ్, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, రెండు మండలాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
