ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    అభివృద్ధి పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు.. అసలు లక్ష్యం మంత్రి పదవే_ మాజీ ఎమ్మెల్యే రాజయ్య

    • దళితులకు చేసిందేమీ లేదు.. ‘దళిత దొర’ బిరుదు ఒక్కటే సాధించారు: తాటికొండ రాజయ్య
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు30 సెప్టెంబర్, 202602:01 AM
    అభివృద్ధి పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు.. అసలు లక్ష్యం మంత్రి పదవే_ మాజీ ఎమ్మెల్యే రాజయ్య
    స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 30 ప్రజాధ్వని : స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఢిల్లీ, హైదరాబాద్‌ చుట్టూ తిరుగుతున్నారని, ఆయన అసలు లక్ష్యం మంత్రి పదవి పొందడమేనని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సమయంలో తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు వస్తారని, తద్వారా మంత్రి పదవి దక్కుతుందని కడియం శ్రీహరి ఆశించారని, అయితే ఆ అంచనాలు నెరవేరలేదని విమర్శించారు. కడియం శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అభివృద్ధి పేరుతో కలుస్తున్నారని రాజయ్య ఆరోపించారు. నియోజకవర్గంలో వాస్తవ అభివృద్ధి పరిస్థితిని ప్రజలకు వివరించకుండా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

    ‘దళిత దొర’ బిరుదు ఒక్కటే

    కడియం శ్రీహరి తనను తాను దళితుడిగా చెప్పుకుంటున్నప్పటికీ స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గంలో దళితుల అభివృద్ధికి చేసిందేమీ లేదని రాజయ్య ఆరోపించారు. కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పదవులు అనుభవించారే తప్ప, ఒక్క దళిత నాయకుడిని కూడా రాజకీయంగా ఎదగనివ్వలేదని విమర్శించారు. ఆయన సాధించినదేమైనా ఉందంటే ‘దళిత దొర’ అనే బిరుదు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుపై పదేపదే విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నైతిక విలువలపై గౌరవం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి రావాలని సవాల్‌ విసిరారు.

    అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

    స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులను రాజయ్య వివరించారు. జనగామ జిల్లా ఏర్పాటు, స్టేషన్‌ ఘనపూర్‌ రెవెన్యూ డివిజన్‌, హెల్త్‌ యూనివర్సిటీ, రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, పాలిటెక్నిక్‌ కళాశాల, మోడల్‌ స్కూల్‌, కస్తూర్బా పాఠశాలలు, మహిళా డిగ్రీ కళాశాల వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అప్పటి ప్రభుత్వం, కేసీఆర్‌ సహకారంతో సాధ్యమయ్యాయని తెలిపారు. అలాగే గ్రామాల్లో చెరువులు, కుంటల మరమ్మతులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, నర్సరీలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. తన హయాంలో వేలాది ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జరిగిందని పేర్కొన్నారు. కడియం శ్రీహరి తన పదవీకాలంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాజయ్య డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

    ‘ప్రజాబలంతో గెలిచింది నేనే’

    తాను స్థానికుడినని, ప్రజల మద్దతుతో వరుసగా ఎన్నికల్లో విజయం సాధించానని రాజయ్య పేర్కొన్నారు. తనకు, కడియం శ్రీహరికి మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ.. తన విజయాలు ప్రజాబలంతో సాధించినవని, కడియం శ్రీహరి రాజకీయ ఎత్తులు, వ్యూహాలతో మాత్రమే గెలిచారని విమర్శించారు. తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి, ప్రస్తుత పాలనలో జరుగుతున్న పనులకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికలకు సిద్ధమైతే తాను కూడా సిద్ధంగా ఉన్నానని, ప్రజల తీర్పు ద్వారా ఎవరి బలం ఎంతో తేలుతుందని వ్యాఖ్యానించారు.

    ‘రాజీనామా చేసి ఎన్నికలకు రా’

    కడియం శ్రీహరి గతంలో టీడీపీ, బీఆర్‌ఎస్‌లో ఉన్న కాలంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని రాజయ్య డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రాజకీయ విమర్శలకు తాము సిద్ధమేనని, అయితే వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా అభివృద్ధి అంశాలపై చర్చిద్దామని సూచించారు. కడియం శ్రీహరికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నైతిక విలువలపై నమ్మకం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని రాజయ్య సవాల్‌ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై న్యాయపరమైన పరిణామాలను ప్రస్తావిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: