అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
- రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.63 లక్షల పింఛన్లు మంజూరు..ఏటా రూ.12 వేల కోట్ల వ్యయం
- నవంబర్ 19 నుంచి ఇందిరా కుటుంబ బీమా పథకం ప్రారంభం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు16 నవంబర్, 202609:48 AM
అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ…

జఫర్‌గఢ్, నవంబర్ 16 (ప్రజాధ్వని): అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. జఫర్‌గఢ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన చేయూత నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జఫర్‌గఢ్, ఐనవోలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 32 మందికి రూ.13.53 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు, మరో ఐదుగురికి రూ.1.41 లక్షల ఆర్థిక సాయం, 37 మందికి రూ.37.04 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. జఫర్‌గఢ్ మండలంలో ఐదు కేటగిరీల కింద కొత్తగా 717 మందికి చేయూత పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. వీరిలో 168 మంది దివ్యాంగులు, 27 మంది ఒంటరి మహిళలు, ఆరుగురు పెళ్లికాని మహిళలు, 105 మంది గీత కార్మికులు, ఒక చేనేత కార్మికుడు, 410 మంది వితంతువులు ఉన్నారని వివరించారు.

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న పింఛన్లకు అదనంగా 4.63 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేయడం ద్వారా మరింతమంది పేదలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. పింఛన్ల కోసం ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండు విడతల్లో 8 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, సన్నబియ్యం పంపిణీ ద్వారా కోటి పది లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. మహిళా సంఘాలను ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దడంతో పాటు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తోందన్నారు. అర్హత ఉండి పింఛన్లు మంజూరు కానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రత్యేక కేంద్రాల ద్వారా దరఖాస్తుల్లోని లోపాలను సరిచేసి అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నెల 19న నగదు జమ అవుతుందని వెల్లడించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన చొరవతో నియోజకవర్గానికి సుమారు రూ.2 వేల కోట్ల నిధులు సమకూరాయని తెలిపారు. డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు, దేవాదుల నీటితో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు చేస్తున్న కృషికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు.

అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 2022 నుంచి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించిందన్నారు. గ్రామాల్లో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు పింఛన్ల కోసం పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లు మంజూరు చేశారని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 44.50 లక్షల పింఛన్లు ఉండగా, కొత్తగా 4.63 లక్షల పింఛన్లు మంజూరు చేయడంతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందని తెలిపారు. అర్హత ఉండి పింఛన్ రాని వారు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు పరిశీలించి అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కోటి పది లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ, 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇందిరా కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గత మూడేళ్లలో సుమారు రూ.1,600 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు అభివృద్ధి నిధులు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు. జఫర్‌గఢ్ మండలంలోని కొండైచెర్ల వద్ద రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, మరో రూ.200 కోట్లతో దేవాదుల ఆరో ప్యాకేజీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి ఓబ్లాపూర్ క్రాస్ వరకు రహదారి విస్తరణ, జఫర్‌గఢ్‌లో నాలుగు వరుసల రహదారి, జఫర్‌గఢ్ నుంచి సూరారం మీదుగా హిమ్మత్‌నగర్ వరకు ఆరు కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. పలు హ్యామ్ రహదారుల పనులకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 32 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో తనకు అనుబంధం ఉందని, ప్రజాసేవలో ఎప్పుడూ అవినీతికి తావివ్వలేదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. గతంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నవారు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, రెవెన్యూ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
