గుడిసెల్లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు19 మే, 202606:03 AM

ధర్మసాగర్ మండలం ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముప్పారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించగా, నారాయణగిరిలో ఇందిరమ్మ ఇండ్లతో పాటు రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ముప్పారం (64), నారాయణగిరి (40), సోమదేవరపల్లి (4) గ్రామాలకు చెందిన మొత్తం 108 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అలాగే ముప్పారం గ్రామంలో గౌడ, కురుమ కమ్యూనిటీ హాల్లు, నారాయణగిరిలో ముదిరాజ్, మహిళా కమ్యూనిటీ హాల్లకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తోందన్నారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కింద 114 పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నారాయణగిరి, ముప్పారం గ్రామాలకు రూ.3 కోట్ల చొప్పున అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు, తన ఎంపీ నిధుల నుంచి రూ.3.5 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గత 20 ఏళ్లలో లేనివిధంగా అభివృద్ధి జరుగుతోందని అన్నారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం పలు పథకాలతో అండగా నిలుస్తోందని, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కొంతమంది రాజకీయ ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని, కానీ తాను నియోజకవర్గ అభివృద్ధికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. గుడిసెలు, రేకులు, టార్పాలిన్ ఇళ్లలో నివసించే పేద కుటుంబాలకు రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాల వారీగా ప్రత్యేక సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తామని, ప్రభుత్వ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరితోనూ రూపాయి తీసుకోలేదని పేర్కొన్నారు. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఒక్కో నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నారని తెలిపారు. నారాయణగిరి జడ్పిహెచ్ఎస్ పాఠశాలను తెలంగాణ మాడల్ స్కూల్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నారాయణగిరి సర్పంచ్ పుట్ట రేణుక, ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక, హౌసింగ్ పీడీ సిధార్థ్ నాయక్, పీఆర్ అధికారులు, తహసీల్దార్, ఎంపిడివో, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
