ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    ఇళ్లు అసంపూర్తి.. బతుకులు అస్తవ్యస్తం!

    • తమ్మడపల్లి ఐలో కనీస వసతులకు నోచుకోని 13 కుటుంబాలు
    • విద్యుత్‌, నీటి సౌకర్యాలు కల్పించాలి బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్‌గౌడ్‌ డిమాండ్‌
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు3 అక్టోబర్, 202611:06 AM
    ఇళ్లు అసంపూర్తి.. బతుకులు అస్తవ్యస్తం!
    జాఫర్‌ఘడ్‌, అక్టోబరు 3 (ప్రజాధ్వని): ఆధునిక కాలంలోనూ కనీస వసతులకు నోచుకోకుండా జీవిస్తున్న తమ్మడపల్లి ఐ గ్రామంలోని పేద కుటుంబాలకు ఇళ్లు, విద్యుత్‌, నీటి సౌకర్యాలు కల్పించాలని బీజేపీ జాఫర్‌ఘడ్‌ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన గ్రామంలోని పరిస్థితులను పరిశీలించి మాట్లాడారు. తమ్మడపల్లి ఐ గ్రామం నుంచి ఉప్పుగల్లు వెళ్లే మార్గంలో ఊరి చివరన 2019లో అప్పటి ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టిందని నగేష్‌గౌడ్‌ తెలిపారు. మొత్తం 25 ఇళ్లు మంజూరు కాగా, 14 ఇళ్లు మాత్రమే సుమారు 90 శాతం పూర్తయ్యాయని, మరో 11 ఇళ్లు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయని పేర్కొన్నారు. నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ఇళ్లులేని పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం సుమారు 13 కుటుంబాలు నిలువ నీడ లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఇళ్లలోనే చిన్నచిన్న ఏర్పాట్లు చేసుకుని జీవిస్తున్నారని ఆయన అన్నారు. వృద్ధులు, పేద కుటుంబాలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లు కావస్తున్నా ఈ కుటుంబాల సమస్యలు పరిష్కారం కాలేదని నగేష్‌గౌడ్‌ విమర్శించారు. అధికారులు తక్షణమే స్పందించి 13 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించాలని, అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పూర్తిచేసి అర్హులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రధాన రహదారి నుంచి సుమారు 250 మీటర్ల లోపల నివాసాలు ఉండటంతో విద్యుత్‌, నల్లా కనెక్షన్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే విద్యుత్‌, తాగునీటి కనెక్షన్లు ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలు కల్పించాలని బీజేపీ జాఫర్‌ఘడ్‌ మండల కమిటీ తరఫున కోరారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: