ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    జిల్లా వార్తలు

    క్రీడలతోనే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు: ఎంపీ కావ్య

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు5 జూన్, 202604:31 PM
    క్రీడలతోనే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు: ఎంపీ కావ్య
    భూపాలపల్లి, జూన్ 5 ప్రజాధ్వని : యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న 11వ యూత్ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్-2026 పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
    క్రీడలతోనే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు: ఎంపీ కావ్య - అదనపు చిత్రం 1
    ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య స్వయంగా బాస్కెట్‌బాల్ గోల్ వేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ... చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రపంచ బాస్కెట్‌బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్‌ను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు తమ లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని సూచించారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా మరింత శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.
    క్రీడలతోనే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు: ఎంపీ కావ్య - అదనపు చిత్రం 2
    తాను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో బాస్కెట్‌బాల్, క్రికెట్ ఆడినట్లు గుర్తు చేసుకున్నారు. బాస్కెట్‌బాల్ అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. భూపాలపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడా మౌలిక వసతుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హనుమకొండ జిల్లా ఉనికిచెర్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు. అలాగే పాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ స్కూల్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు.
    క్రీడలతోనే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు: ఎంపీ కావ్య - అదనపు చిత్రం 3
    క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు, ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడు ఉత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణకు, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సంకీర్త్, బాస్కెట్‌బాల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్, జెన్‌కో సీఈ ప్రకాష్, మున్సిపల్ చైర్మన్ కొమురయ్య, జిల్లా క్రీడాశాఖ అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: