చిల్పూర్ గుట్టకు రూ.10 కోట్ల మాస్టర్ ప్లాన్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు6 జులై, 202601:13 PM

చిల్పూర్ , జూలై 6 ప్రజాధ్వని : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చిల్పూర్ బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్లో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో చిల్పూర్ దేవస్థానం అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. వెంకటేశ్వరపల్లి నుంచి ఆలయం వరకు రహదారి విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, రిటైనింగ్ వాల్, కల్యాణ మండపం, అన్నదాన సత్రం, కాటేజీలు, ఈవో కార్యాలయం, టాయిలెట్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆలయం ముందు ఉన్న ఆక్రమణలను తొలగించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో చిల్పూర్ బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, దేవాదాయ శాఖ అధికారులు, ఈఈలు, ఈవోలు తదితరులు పాల్గొన్నారు.
