దళిత మహిళా సర్పంచ్‌పై దాడిని ఖండించిన ఎమ్మార్పీఎస్
- దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్ నాయకులు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు2 అక్టోబర్, 202601:18 PM

స్టేషన్‌ఘన్‌పూర్, అక్టోబర్ 2 ప్రజాధ్వని: స్టేషన్ ఘనపూర్ మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో దళిత మహిళా సర్పంచ్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది, సర్పంచ్ కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బెల్ట్‌షాపులను మూసివేయాలని గ్రామపంచాయతీలో తీర్మానం చేసినట్లు ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. తీర్మానం అమలులో భాగంగా చర్యలు చేపడుతున్న సమయంలో కొందరు బెల్ట్‌షాపుల నిర్వాహకులు, వారికి అండగా ఉన్న వ్యక్తులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి సిబ్బంది, సర్పంచ్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సర్పంచ్‌పై కూడా దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. డ్రగ్స్, బెల్ట్‌షాపుల కారణంగా యువత, కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజల ప్రయోజనాల కోసం గ్రామపంచాయతీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం తప్పు కాదన్నారు. దాడి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత మహిళా సర్పంచ్‌పై జరిగిన దాడిని కేవలం వ్యక్తిగత దాడిగా చూడరాదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిపై జరిగిన దాడిగా పరిగణించాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోనే ప్రజాప్రతినిధులు, సిబ్బందిపై దాడులు జరిగితే వారు తమ విధులను స్వేచ్ఛగా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్, ఆమె కుటుంబ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్, పంచాయతీ సిబ్బందికి ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోవిందు ఇసాక్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ఆరూరు శ్రీనివాస్ మాదిగ, నలిమేల నాగరాజు మాదిగ, జిల్లా నాయకులు మంద శ్రీనివాస్ మాదిగ, కలకోలా రాజశేఖర్ మాదిగ, అనిల్ మాదిగ, విశ్వనాథపురం ఉపసర్పంచ్ దాసి శ్రీకాంత్, కంచర్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
