దళిత డిక్లరేషన్ హామీలు బుట్టదాఖలు: డా. రాజయ్య
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు24 జూన్, 202610:20 AM

రఘునాథపల్లి, జూన్ 24 ప్రజాధ్వని : కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాలయాపన చేస్తోందని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా. రాజయ్య ఆరోపించారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించిన దళిత డిక్లరేషన్‌లోని 12 హామీలలో ఒక్కదాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దళిత బంధు పథకం ద్వారా వేలాది మంది దళితులకు లబ్ధి చేకూరిందని, రెండో విడతలో మరో రెండు లక్షల మందికి ప్రయోజనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. దళిత బంధు పథకం పేరును మార్చి అంబేద్కర్ అభయ హస్తం పేరుతో దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. దళితుల కోసం మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, మంత్రి లక్ష్మణ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.6 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఆ మేరకు నిధులు అందలేదన్నారు. నిరుద్యోగ భృతి, ఎస్సీ కార్పొరేషన్‌కు ఏటా రూ.750 కోట్లు, గిరిజన కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీభవన్ నుంచి బస్సు యాత్రలు చేపట్టడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దళితులకు చేసిన మేలు ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా రిజర్వేషన్లను వినియోగించుకుంటున్న ఆయన, రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. రూ.1,400 కోట్ల అభివృద్ధి ఫ్లెక్సీలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక పథకం ద్వారా దళితులకు 650 మినీ డైరీ ఫామ్ యునిట్లు తీసుకువచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు చేసిన మేలును వివరించిన తర్వాతే అడుగుపెట్టాలని, లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి మూసిపట్ల విజయ్,గూడా కిరణ్, బొల్లం రాజు, ఎడ్ల బాలరాజు , ముక్క పరుశురాం, ఉడుముల భాగ్య, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
