ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: కడియం శ్రీహరి

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు7 జులై, 202601:24 AM
    కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: కడియం శ్రీహరి
    స్టేషన్ ఘనపూర్, జూలై 6 ప్రజాధ్వని : పార్టీ బలోపేతంతో పాటు నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు. స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని ఎస్ కన్వెన్షన్‌లో సోమవారం నిర్వహించిన నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షుల పరిచయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
    కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: కడియం శ్రీహరి - అదనపు చిత్రం 1
    పీసీసీ కమిటీల ఏర్పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని జరిగిందని, ఇందులో ఎవరి వ్యక్తిగత ప్రమేయం లేదన్నారు. కమిటీల్లో దాదాపు 80 శాతం మంది పాత కాంగ్రెస్ నాయకులకే అవకాశం కల్పించారని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశానని, ఇకపై కూడా కాంగ్రెస్ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని పేర్కొన్నారు. తన 32 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతికి తావివ్వలేదని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమన్నారు. మంచిగా పనిచేసే వారికి పూర్తి సహకారం అందిస్తానని, చౌకబారు రాజకీయాలకు తన వద్ద స్థానం లేదని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని కోరారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించిన ఆయన, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
    కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: కడియం శ్రీహరి - అదనపు చిత్రం 2
    బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. కాళేశ్వరం దెబ్బతిన్న తర్వాత కూడా మూడు నెలలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావుతో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: