సన్నబియ్యం ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం
- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుడు కురుసపెల్లి రమేష్ ఆగ్రహం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు2 నవంబర్, 202601:39 AM
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు కుటుంబాలను ఎలా పోషించుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు కురుసపెల్లి రమేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్నబియ్యం ధరలు పెరుగుతుండటంపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

స్టేషన్ ఘనపూర్,నవంబర్ 2 ప్రజాధ్వని: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు కుటుంబాలను ఎలా పోషించుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు కురుసపెల్లి రమేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్నబియ్యం ధరలు పెరుగుతుండటంపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని ఒకవైపు ప్రచారం చేసుకుంటూనే, మరోవైపు మార్కెట్లో బియ్యం ధరలు సామాన్యులకు అందనంతగా పెరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలను ప్రభుత్వం నిర్ణయించడంపై స్పందించిన రమేష్.. ప్రభుత్వం ప్రకటించిన ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా ఉన్నాయా? లేక మిల్లర్లు, వ్యాపారస్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయా? అని ప్రశ్నించారు. పేదల సంక్షేమమే లక్ష్యమని చెప్పుకునే ప్రభుత్వం బియ్యం ధరల విషయంలో ప్రజలకు భారం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని నిలదీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ, కేఎన్ఎం రకం సన్నబియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రకం కిలో రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకం కిలో రూ.79గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ధరలకు మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ హెచ్చరించిందని తెలిపారు. నిర్ణయించిన ధరలను దుకాణాల్లో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బియ్యం ధరలు కూడా భారంగా మారితే పేదలు, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏమిటని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాటల్లో పేదల సంక్షేమం చెబుతూ, చేతల్లో ప్రజలపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. సన్నబియ్యం ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచించి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
