సంక్షేమ పథకాల అమలే ప్రభుత్వ లక్ష్యం:Mla కడియం శ్రీహరి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు2 ఏప్రిల్, 202610:06 AM

స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 2 ప్రజాధ్వని : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభలు వేగంగా కొనసాగుతున్నాయి. జఫర్గడ్ మండలం ఉప్పుగల్, స్టేషన్ ఘనపూర్ మండలం పామునూరు గ్రామాల్లో నిర్వహించిన సభలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పరిస్థితిని పరిశీలించడం లక్ష్యంగా ఈ గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ, గృహ అవసరాలకు 200 యూనిట్ల అమలవుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించామని, రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. అలాగే ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. కొత్తగా కోటి 10 లక్షల కుటుంబాలకు కుటుంబ భీమా పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉప్పుగల్ గ్రామానికి ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్న శ్రీహరి, గ్రామ అభివృద్ధికి గతంలోనే పలు పనులు చేపట్టినట్లు తెలిపారు. చెక్‌డ్యామ్, బ్రిడ్జి నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాజా గా సిసి రోడ్లు, ఇతర పనులకు రూ.60 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం పనులను త్వరలో పూర్తి చేస్తామని, చెరువులకు సాగునీరు అందించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడతలో 41 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పామునూరులో అభివృద్ధి పనులు
పామునూరు గ్రామంలో కూడా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీహరి తెలిపారు. సిసి రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను దశల వారీగా మంజూరు చేస్తామని వెల్లడించారు. గ్రామంలోని కాలువలు, రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామని, ఐకేపి సెంటర్ కోసం భూమి కేటాయించాలని అధికారులకు ఆదేశించారు. పని చేయని వారే ఎక్కువగా మాట్లాడుతున్నారని, అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు గతంలో చేసిన పనులను గుర్తు చేసుకోవాలని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


