ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    చిల్పూర్

    పేదల సంక్షేమానికి పెద్దపీట.. అర్హులందరికీ చేయూత పెన్షన్లు

    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు17 నవంబర్, 202602:41 AM

    అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గతంలో కొత్త పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రజల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి…

    పేదల సంక్షేమానికి పెద్దపీట.. అర్హులందరికీ చేయూత పెన్షన్లు
    చిల్పూరు, నవంబర్ 16, ప్రజాధ్వని: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గతంలో కొత్త పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రజల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేసిందని తెలిపారు. చిల్పూరు మండల కేంద్రంలో సోమవారం నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పత్రాలతోపాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 21 మంది లబ్ధిదారులకు రూ.9.01 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు, 25 మందికి రూ.25.02 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. చిల్పూరు మండలంలోని 17 గ్రామాలకు చెందిన 836 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వీరిలో 177 మంది దివ్యాంగులు, 27 మంది ఒంటరి మహిళలు, 10 మంది పెళ్లికాని మహిళలు, 134 మంది గీత కార్మికులు, ఇద్దరు చేనేత కార్మికులు, 486 మంది వితంతువులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో గ్రామాల్లో పర్యటించినప్పుడు భర్తను కోల్పోయిన మహిళలు, కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేదలు, దివ్యాంగులు పెన్షన్ల కోసం తన దృష్టికి సమస్యలు తీసుకొచ్చేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం వారి సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుతోపాటు పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని కడియం శ్రీహరి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రుణమాఫీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 45 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, ఇందుకోసం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీకి రూ.13,500 కోట్లు, రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో గత మూడేళ్లలో సుమారు రూ.1,600 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నూతనంగా ఏర్పడిన చిల్పూరు మండలంలో తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.08 కోట్లు, ఎంపీడీవో కార్యాలయ భవనానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఏటీసీ భవన నిర్మాణానికి కూడా నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే మూడు భవనాలకు శంకుస్థాపనలు నిర్వహిస్తామని చెప్పారు. మండలంలోని శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, మల్కాపూర్ తదితర గ్రామాలకు గోదావరి జలాలు అందించేందుకు గండిరామారం ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. హామ్ పద్ధతిలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి టెండర్లు, ఒప్పందాల ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుని వచ్చే యాసంగి సీజన్‌లో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని కడియం శ్రీహరి సూచించారు. నీటి లభ్యతను అంచనా వేయకుండా అధిక నీరు అవసరమయ్యే పంటలు సాగు చేస్తే చివరి దశలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. దేవాదుల ద్వారా అందుతున్న నీటిని సమర్థంగా వినియోగించుకుంటూ నియోజకవర్గంలో పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరులో ఎలాంటి అవినీతి, లంచాలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో పథకాలు, కాంట్రాక్టులు, పదవుల విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎవరి వద్దా ఒక్క రూపాయి ఆశించకుండా ప్రజలకు సేవలందిస్తున్నానని తెలిపారు. పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, చిల్పూరు మండల అధ్యక్షులు చిర్ర నాగరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: