ఇప్పగూడెం వృద్ధ దంపతులకు న్యాయం చేయాలి: మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
- రూ.50 వేలు ఇస్తేనే ఇల్లు మంజూరా?
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు28 సెప్టెంబర్, 202607:29 AM

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 28 ప్రజాధ్వని:
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అక్రమాలు జరుగుతున్నాయని, దళారుల ప్రమేయంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కోలిపాక వెంకటయ్య, వెంకటమ్మకు జరిగిన పరిణామాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఇల్లు మంజూరైనట్లు అధికారులు హామీ ఇవ్వడంతో ఉన్న పాత ఇంటిని కూల్చుకున్న వృద్ధ దంపతులకు ఇప్పుడు ఇల్లు మంజూరు కాదని చెప్పడం ఏమిటని రాజయ్య ప్రశ్నించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా మంజూరు పత్రం అందుకున్న తర్వాత పరిస్థితి మారిందని, దీంతో సొంత ఇల్లు లేక వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి పరిస్థితిని ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతికి తావులేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రాజయ్య విమర్శించారు. నియోజకవర్గంలో దళారుల ద్వారా రూ.50 వేలు వసూలు చేసి ఇళ్లు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి, లబ్ధిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని రాజయ్య డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇప్పగూడెం గ్రామాన్ని స్వయంగా సందర్శించి వృద్ధ దంపతుల పరిస్థితిని పరిశీలించి, అర్హతను నిర్ధారించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

