ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    ఘనంగా జీడికల్‌ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

    • జాతరలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు22 సెప్టెంబర్, 202609:43 AM
    ఘనంగా జీడికల్‌ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
    లింగాల ఘనపూర్‌, సెప్టెంబర్‌ 22 ప్రజాధ్వని: చారిత్రక ప్రాశస్త్యం కలిగిన జీడికల్‌ వీరాచల రామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. జీడికల్‌ రామచంద్రస్వామి ఆలయ విశిష్టత రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. నవంబర్‌లో కార్తీక మాసంలో జరగనున్న జీడికల్‌ శ్రీ వీరాచల రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత జాతరలతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
    ఘనంగా జీడికల్‌ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు - అదనపు చిత్రం 1

    మౌలిక వసతులకు ప్రాధాన్యం

    వేలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, రహదారులు తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కడియం శ్రీహరి అన్నారు. ఆలయం ముందు సీసీ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయడంతోపాటు డివైడర్‌లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరం నీరు, విద్యుత్‌ అందుబాటులో ఉండేలా శాశ్వత ప్రాతిపదికన కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించాలని తెలిపారు. ఆలేరు నుంచి జీడికల్‌ గ్రామ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సుమారు మూడు కిలోమీటర్ల రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కల్యాణ మండపం పక్కనున్న స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని సూచించారు.
    ఘనంగా జీడికల్‌ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు - అదనపు చిత్రం 2

    పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం

    ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు నీడనిచ్చే చెట్లను పెద్ద సంఖ్యలో నాటి పచ్చదనాన్ని పెంచాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఆలయ పరిసరాలను తీర్చిదిద్దాలని సూచించారు.
    ఘనంగా జీడికల్‌ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు - అదనపు చిత్రం 3

    వైద్య శిబిరం.. పోలీసు బందోబస్తు

    భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది, మందులు, అంబులెన్స్‌తో ప్రత్యేక హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసరాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. జాతర ఏర్పాట్లలో అన్ని శాఖలను సమన్వయం చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని పనులను జాతరలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
    ఘనంగా జీడికల్‌ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు - అదనపు చిత్రం 4

    31 మంది సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

    సమీక్ష సమావేశం అనంతరం ఆలయ ప్రాంగణంలో లింగాల ఘనపూర్‌ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌తో కలిసి కడియం శ్రీహరి రూ.13.61 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, ఆర్డీవో గోపిరామ్‌, ఆలయ చైర్మన్‌ నరసింహులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి వంశీ, నాయకులు గుడి వంశీధర్‌రెడ్డి, కొల్లూరి శివకుమార్‌, సాదం విజయ్‌ మనోహర్‌, ఆలయ కమిటీ డైరెక్టర్లు, విద్యుత్‌, ఇంజనీరింగ్‌, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, వైద్య, పోలీసు శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    ఘనంగా జీడికల్‌ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు - అదనపు చిత్రం 6
    మీ స్పందన:

    షేర్ చేయండి: