ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు15 ఏప్రిల్, 202602:22 AM

చిల్పూర్, ఏప్రిల్ 14 ప్రజాధ్వని : జనగాం జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆదేశాల మేరకు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కందుకూరు రజినీకార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయమని, నేటి యువత ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం శ్రమించిన మహనీయుడిగా అంబేద్కర్ నిలిచారని పేర్కొన్నారు. పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడిన విశ్వమానవుడిగా, భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని తెలిపారు.
అంబేద్కర్ బోధనలు, విలువలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు ఊరటి రాజు ముదిరాజ్, ముక్కెర రమేష్ యాదవ్, మండల నాయకులు వాళ్లబోజు బ్రాహ్మచారి, ఆవుల సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
