రాజయ్య.. హిట్ వికెట్ తో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు
- నియోజకవర్గంలో రూ.1600 కోట్లతో అభివృద్ధి పనులు
- 20 ఏళ్ల పెండింగ్ పనులు పూర్తి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు21 సెప్టెంబర్, 202602:39 PM

స్టేషన్ ఘనపూర్ 21 సెప్టెంబర్ ప్రజాధ్వని స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించిన పట్టణ, వార్డు, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన పట్టణ, వార్డు అధ్యక్షులను శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం స్టేషన్ ఘనపూర్ ను మున్సిపాలిటీ చేశానని, సీఎం రేవంత్ రెడ్డిని అడిగి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి ఇవ్వనంతగా 50 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. త్వరలోనే పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతాయని, ప్రతి వార్డుకు రూ.15 లక్షలు, 10 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసి కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా అని మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై ధ్వజమెత్తారు. రాజయ్య డకౌట్ కాలేదు, హిట్ వికెట్ ద్వారా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.

`స్టేషన్`లో 1600 కోట్ల అభివృద్ధి:
20 ఏళ్లుగా ఆగిన అభివృద్ధిని 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నానని, నియోజకవర్గంలో రూ.1600 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. 100 పడకల ఆసుపత్రికి రూ.45.50 కోట్లు, యంగ్ ఇండియా స్కూల్ కు రూ.200 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ.400 కోట్లు మంజూరు అయ్యాయన్నారు.
కేసీఆర్, బీజేపీపై విమర్శలు
కేసీఆర్ కు ఉద్యమకారులపై ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఫండ్ రూ.1400 కోట్లను పంచాలని సవాల్ విసిరారు. తెలంగాణ వల్ల ప్రజలకు ఏమీ రాలేదని, కేసీఆర్ కుటుంబానికి మాత్రం వందల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని విమర్శించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం, రేవంత్ రెడ్డిని రెండోసారి సీఎం చేయడమే లక్ష్యంగా పని చేయాలని, ఏ ఎన్నికలు వచ్చినా స్టేషన్ ఘనపూర్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబాటి కిషన్ రాజ్, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
