అనాథ వితంతువులు – ఒంటరి మహిళల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు27 ఫిబ్రవరి, 202607:27 AM

హనుమకొండ, ఫిబ్రవరి 27 ప్రజాధ్వని:
అనాథ వితంతువులు, ఒంటరి మహిళల రక్షణ, పునరావాసం, సంక్షేమం లక్ష్యంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య ప్రవేశపెట్టిన “అనాథ వితంతువులు – ఒంటరి మహిళల (రక్షణ, పునరావాసం, సంక్షేమం) బిల్లు – 2025”కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ మేరకు భారత రాష్ట్రపతి పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(3) ప్రకారం లోక్సభలో బిల్లును పరిశీలించేందుకు సిఫార్సు చేసినట్లు లోక్సభ సెక్రటేరియట్ అధికారికంగా వెల్లడించింది. ఈ అంశంపై కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి లోక్సభ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. మహిళల సంక్షేమం, గౌరవం, భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో గతేడాది డిసెంబర్ 6న పార్లమెంట్లో డా. కడియం కావ్య రెండు ప్రైవేట్ మెంబర్స్ బిల్లులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఎంపీగా డా. కడియం కావ్య గుర్తింపు పొందారు. తాను ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆమె, అనాథ వితంతువులు, ఒంటరి మహిళల రక్షణ, పునరావాసం, సంక్షేమం కోసం ఈ బిల్లు కీలకంగా మారుతుందని తెలిపారు. కేవలం చట్టపరమైన ఆమోదంతోనే ఆగిపోకుండా, కార్యరూపం దాల్చి, అనాథ వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రత్యక్షంగా హక్కులు, భద్రత, సంక్షేమ ఫలాలు అందే వరకూ నిరంతరంగా పోరాటం కొనసాగిస్తానని డా. కడియం కావ్య స్పష్టం చేశారు.
