ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    మండల వార్తలు

    కోదాడలో గంజాయి ముఠా గుట్టురట్టు.. 150 కిలోల గంజాయి పట్టివేత

    • హోండా సిటీ కారులో తరలిస్తుండగా ఇద్దరు అరెస్ట్‌.. మరో ముగ్గురు పరారీ
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు2 నవంబర్, 202611:12 AM

    గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును కోదాడ టౌన్ పోలీసులు రట్టు చేశారు. హోండా సిటీ కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను…

    కోదాడలో గంజాయి ముఠా గుట్టురట్టు.. 150 కిలోల గంజాయి పట్టివేత
    రాయపర్తి, నవంబర్ 2 (ప్రజాధ్వని): గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును కోదాడ టౌన్ పోలీసులు రట్టు చేశారు. హోండా సిటీ కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఈశ్వర్, శివప్ప, ఒడిశాకు చెందిన రాజు కలిసి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలని పథకం రచించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సెల్వ సూర్య, రాజగౌడన్ మురుగన్‌లను తమ అక్రమ వ్యాపారంలోకి దించారు. గంజాయి రవాణా చేసే ప్రతి ట్రిప్పునకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున, గంజాయి విక్రయించిన అనంతరం అదనంగా మరో రూ.30 వేలు చెల్లిస్తామని ఆశ చూపారు. ఇందుకోసం హోండా సిటీ కారును ఏర్పాటు చేసి రాజమండ్రి నుంచి బెంగళూరుకు గంజాయిని తరలించే బాధ్యతను అప్పగించారు. నిందితుల విచారణలో గతంలోనూ గంజాయి రవాణా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. సుమారు నెల రోజుల క్రితం సెల్వ సూర్య, రాజగౌడన్ మురుగన్‌లు రాజమండ్రి నుంచి బెంగళూరుకు 27 గంజాయి ప్యాకెట్లను తరలించినట్లు పోలీసులు గుర్తించారు. తిరిగి అదే తరహాలో రవాణాకు అంగీకరించిన వీరిద్దరూ అక్టోబర్ 29న కర్ణాటక నుంచి బయలుదేరి, అక్టోబర్ 30 రాత్రి రాజమండ్రికి చేరుకున్నారు. అనంతరం అక్టోబర్ 31న ఒడిశాకు చెందిన రాజు తీసుకొచ్చిన 62 ప్యాకెట్లలోని సుమారు 150 కిలోల గంజాయిని కారులో లోడ్ చేసుకుని బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులకు అందిన ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన కోదాడ టౌన్ పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన హోండా సిటీ కారును, రూ.15 వేల నగదును, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో సెల్వ సూర్య, రాజగౌడన్ మురుగన్‌లను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ అక్రమ రవాణా వెనుక ప్రధానంగా వ్యవహరించిన కర్ణాటకకు చెందిన ఈశ్వర్, శివప్ప, ఒడిశాకు చెందిన రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి రవాణా చేస్తున్న ఈ ముఠా కార్యకలాపాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్‌ ఫ్రీ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు, వినియోగం లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ శివశంకర్, ఎస్‌ఐలు అజయ్‌కుమార్, ఉపేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, నవీన్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: