ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
- ఆక్రమణల తొలగింపు.. భూముల రక్షణకు తక్షణ చర్యలు
- నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు6 జులై, 202612:28 PM

హైదరాబాద్, జూలై 6 ప్రజాధ్వని : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయాల భూములను ఆక్రమణల నుంచి రక్షించడంతో పాటు భక్తుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ హనుమంతరావుతో కలిసి జీడికల్, నవాబ్‌పేట, చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, మల్లికుదుర్ల దేవాలయాల అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో జాప్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్జేసీ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే ఆలయ భూములపై కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి మార్కింగ్ చేపట్టాలని, ఆక్రమణలు తొలగించి భూములను రక్షించాలని సూచించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

జీడికల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అసంపూర్తిగా ఉన్న గర్భగుడి, ప్రాకారాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, జాతర నాటికి కమ్యూనిటీ టాయిలెట్లు, కార్యాలయం, సమావేశ మందిరం, గెస్ట్ హౌస్ నిర్మించాలని సూచించారు. ఆలయ భూముల్లోని అక్రమ నిర్మాణాలను తొలగించి, రూ.5 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు. నవాబ్‌పేట శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి రూ.3 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, కల్యాణ మండపం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

చిల్పూర్ బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.10 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు. వెంకటేశ్వరపల్లి నుంచి ఆలయం వరకు రహదారి విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, రిటైనింగ్ వాల్, కల్యాణ మండపం, అన్నదాన సత్రం, కాటేజీలు, ఈవో కార్యాలయం, టాయిలెట్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలని, ఆలయం ముందు ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. స్టేషన్ ఘనపూర్ శ్రీ తిరుమలనాథస్వామి దేవస్థానంలో ఆలయ భూములపై ఉన్న అక్రమ ఇళ్లు, దుకాణాలను తొలగించాలని, కోనేరును అభివృద్ధి చేయాలని సూచించారు. జాతీయ రహదారి కోసం తీసుకున్న భూమికి సంబంధించిన పరిహారాన్ని ఆలయానికి అందించాలని, ఆలయ ఆభరణాలకు పంచనామా నిర్వహించి అప్పగించాలని తెలిపారు.

ఈ ఆలయానికి రూ.2 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. మల్లికుదుర్ల గట్టు మల్లికార్జునస్వామి దేవస్థానంలో సీజీఎఫ్ నిధులతో మంజూరైన పనులను, భక్తుల విరాళాలతో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ కమిటీ చైర్మన్లు పొట్లపల్లి శ్రీధర్ రావు, అధికారులు, ఈఈలు, ఈవోలు తదితరులు పాల్గొన్నారు.
