స్టేషన్ ఘనపూర్లో అర్ధనగ్న నిరసన జ్వాలలు… ‘ ప్రభుత్వ, యాజమాన్య సిగ్గు’ అంటూ కార్మికుల గర్జన!
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు13 ఏప్రిల్, 202608:42 AM

స్టేషన్ ఘనపూర్ ఏప్రిల్13 ప్రజాధ్వని : స్టేషన్ ఘనపూర్లో ఆర్టిసన్, ఆన్మ్యాన్డ్ కార్మికుల ఆగ్రహం అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందింది. ఆరు రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు అర్ధనగ్న నిరసనకు దిగారు. “మేము ఇలా అర్ధనగ్నంగా రోడ్డుపైకి రావడం మా అవమానం కాదు… ఇది ప్రభుత్వానికి, యాజమాన్యానికి సిగ్గుచేటు!” అంటూ గళమెత్తారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ డివిజన్ చైర్మన్ పాషం రాజు, నాయకుడు లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. “ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నాం… అయినా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. మా సమస్యలు వినిపించుకోవడానికే ఈ స్థాయికి దిగజారాల్సి వచ్చింది. ఇకనైనా చర్చలకు పిలవకపోతే ఉద్యమం మంటలు మరింత ఎగసిపడతాయి” అంటూ హెచ్చరించారు.
“ప్రజలకు 24 గంటల విద్యుత్ అందించేది మేమే… ప్రాణాల్ని పణంగా పెట్టి పనిచేసేది మేమే… కానీ మా హక్కుల విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం ఎందుకు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. “మేము అడుగుతున్నది ఏమీ అసాధ్యమైనది కాదు… ప్రభుత్వంపై భారమయ్యే డిమాండ్లు కావు… అయినా ఎందుకు పట్టించుకోవడం లేదు?” అని నిలదీశారు.

కార్మికుల దుస్థితిని వివరిస్తూ పాషం రాజు, లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఎండలో, వానలో ప్రాణాల్ని పణంగా పెట్టి పనిచేస్తున్నాం. పని చేస్తూ పిట్టలా కూలిపోతున్నాం… చేతులు, కాళ్లు కాలిపోతున్నాయి. అయినా మా శ్రమను దోపిడీ చేస్తూనే ఉన్నారు. మా ప్రాణాలకు విలువ లేకుండా సేవ చేస్తున్నాం” అని మండిపడ్డారు.
ప్రజలకు కూడా వారు పిలుపునిచ్చారు. “మేము పని చేసినప్పుడు మీకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఇప్పుడు మా పోరాటం వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయని తెలుసు. కానీ ఇది న్యాయమైన పోరాటం… మీరు కూడా మాకు అండగా నిలవాలి” అని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలు కార్మికులను మోసం చేశాయని, ప్రస్తుత ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నామని పేర్కొన్నారు. “ప్రజా ప్రభుత్వం వస్తే కార్మికుల గౌరవం పెరుగుతుందని భావించాం. కానీ ఇప్పటికీ అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఒక కార్మికుడు అర్ధనగ్నంగా రోడ్డుపై ఉండటం కార్మికుడి అవమానం కాదు… ఇది ప్రభుత్వ వైఫల్యం” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఇకనైనా ప్రభుత్వం, యాజమాన్యం మొండి వైఖరిని విడిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. “లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడం. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే పరిస్థితి వస్తే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే” అంటూ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

