వరంగల్ అభివృద్ధిపై లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ డా. కడియం కావ్య
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు4 ఆగస్టు, 202602:20 PM

న్యూఢిల్లీ, ఆగస్టు 4: వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక ప్రగతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. పీఎం గతిశక్తి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌తో పాటు ఇతర కేంద్ర పథకాల కింద వరంగల్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక ఉందా? ఉంటే ఏయే ప్రాజెక్టులు మంజూరయ్యాయి? వాటి వల్ల జిల్లాకు కలిగే ప్రయోజనాలేమిటో వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. వరంగల్ జిల్లాలో రవాణా అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు సుమారు రూ.7,843 కోట్ల వ్యయంతో 447 కిలోమీటర్ల మేర మూడు రైల్వే ప్రాజెక్టులు, రూ.6,133 కోట్లతో 185 కిలోమీటర్ల మేర నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం లభించినట్లు తెలిపింది. అలాగే పీఎం మిత్ర పథకం కింద 1,327 ఎకరాల్లో బ్రౌన్‌ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సుమారు రూ.1,696 కోట్ల వ్యయం కేటాయించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ అభివృద్ధికి సంబంధించిన కేంద్ర ప్రణాళికలు, నిధుల కేటాయింపులు, అమలులో ఉన్న ప్రాజెక్టులపై స్పష్టత కోరినట్లు తెలిపారు. రైల్వేలు, జాతీయ రహదారులు, టెక్స్టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో పారిశ్రామికాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. వరంగల్‌కు మంజూరైన ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తానని ఎంపీ స్పష్టం చేశారు. ప్రకటించిన అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితం కాకుండా వేగంగా అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ఆమె అన్నారు.
