ఇండియా–సౌదీ ఫ్రెండ్షిప్ గ్రూప్‌లో ఎంపీ డా. కడియం కావ్యకు స్థానం
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు25 ఫిబ్రవరి, 202602:01 PM

హనుమకొండ, ఫిబ్రవరి 25 ప్రజాధ్వని :
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఏర్పాటు చేసిన ఇండియా–సౌదీ అరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యురాలిగా ఆమెను గౌరవనీయ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ (కాన్ఫరెన్స్ అండ్ ప్రోటోకాల్ బ్రాంచ్) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భారత్–సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించడమే ఈ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ప్రధాన ఉద్దేశం. అంతర్జాతీయ వేదికపై భారత పార్లమెంట్ ప్రతినిధులుగా ఎంపిక కావడం గౌరవప్రదమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్–సౌదీ అరేబియా సంబంధాలను మరింత పటిష్ఠం చేసే దిశగా పార్లమెంటరీ స్థాయిలో తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక చర్చలు, పరస్పర ప్రతినిధుల పర్యటనలు, పెట్టుబడులు–వాణిజ్య అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
ఇది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి గర్వకారణమని, అంతర్జాతీయ పార్లమెంటరీ వేదికపై తెలంగాణకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం అవుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఆమె నియామకంపై నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
