ప్రజాధ్వని
    ● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం● ప్రజాధ్వని – ప్రతి క్షణం ప్రజా పక్షం
    స్టేషన్ ఘనపూర్/జనగాం

    సీఈసీని జ్ఞానేశ్‌ తక్షణమే భర్తరఫ్‌ చేయాలి

    • ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు.. దేశవ్యాప్త ఉద్యమం చేపడతాం: కడియం శ్రీహరి
    ప్ర

    ప్రజాధ్వని డెస్క్

    ఏరియా వివరాలు లేవు28 సెప్టెంబర్, 202603:51 PM
    సీఈసీని జ్ఞానేశ్‌ తక్షణమే భర్తరఫ్‌ చేయాలి
    జనగామ, సెప్టెంబరు 28 (ప్రజాధ్వని): కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై దేశంలోని రాజకీయ పార్టీలు, ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ), తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) పిలుపు మేరకు సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ పార్క్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాకు కాంగ్రెస్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన నిరసన సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు, కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇచ్చే ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాహుల్‌గాంధీ ముందుగానే ప్రశ్నలు లేవనెత్తారని తెలిపారు.
    సీఈసీని జ్ఞానేశ్‌ తక్షణమే భర్తరఫ్‌ చేయాలి - అదనపు చిత్రం 1
    సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా దాని పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెరిగితే అది ప్రజాస్వామ్యానికి ఇబ్బందికర పరిణామమని కడియం శ్రీహరి అన్నారు. సీఈసీని వెంటనే పదవి నుంచి తొలగించకపోతే ఆందోళనలను మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామస్థాయి నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్‌ శ్రేణులు స్పష్టం చేశారు.
    సీఈసీని జ్ఞానేశ్‌ తక్షణమే భర్తరఫ్‌ చేయాలి - అదనపు చిత్రం 2
    ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మారుజోడు రాంబాబు, జనగామ, స్టేషన్‌ ఘనపూర్‌ మున్సిపల్‌ చైర్మన్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    మీ స్పందన:

    షేర్ చేయండి: