ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫామ్‌ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి_ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కోరిన ఎమ్మెల్యే
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు16 సెప్టెంబర్, 202602:21 PM

హైదరాబాద్ (అసెంబ్లీ), సెప్టెంబర్ 16 (ప్రజాధ్వని): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫామ్‌ఆయిల్ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో అక్కడే ఫామ్‌ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తెలంగాణ శాసనసభలో వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పంటల మార్పిడిపై రైతులకు కల్పిస్తున్న అవగాహనతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఫామ్‌ఆయిల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారని కడియం శ్రీహరి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఫామ్‌ఆయిల్ సాగు గణనీయంగా పెరిగిందని, రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఫామ్‌ఆయిల్ గెలలను నరికిన అనంతరం నిర్ణీత సమయంలోనే ఫ్యాక్టరీకి తరలించి ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుందని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆలస్యమైతే గెలల నాణ్యత తగ్గి రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దూర ప్రాంతాల్లోని ప్రాసెసింగ్ కేంద్రాలకు పంటను తరలించాల్సి రావడంతో రైతులపై రవాణా భారం పడుతోందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఫామ్‌ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు పంటను సకాలంలో ప్రాసెసింగ్ కేంద్రానికి తరలించే అవకాశం ఉంటుందని కడియం శ్రీహరి వివరించారు. దీంతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని, ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫామ్‌ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కడియం శ్రీహరి కోరారు.
