పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు కావాలి!
- అర్హులైన గ్రాడ్యుయేట్లు నవంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలి
- జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శాగంటి మణి పిలుపు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు24 అక్టోబర్, 202609:24 AM
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శాగంటి మణి పిలుపునిచ్చారు.

చిల్పూర్, అక్టోబరు 24 (ప్రజాధ్వని): రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శాగంటి మణి పిలుపునిచ్చారు. చిల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 నవంబరు నాటికి మూడేళ్లు పూర్తిచేసుకున్న డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులని తెలిపారు. అర్హులైన వారు నవంబరు 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. ఓటరు నమోదుకు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు వివరాలు, డిగ్రీ మెమో లేదా విద్యార్హత ధ్రువపత్రం, పాస్పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబరు అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. నమోదు ప్రక్రియలో సందేహాలున్నవారు, సహాయం అవసరమైనవారు తనను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించే నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతి ఓటు ప్రాధాన్యత కలిగి ఉంటుందని మణి పేర్కొన్నారు. రాజకీయ చైతన్యంతో పట్టభద్రులంతా ముందుకు వచ్చి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
