కేసీఆర్ సీఎం, రాజయ్య ఎమ్మెల్యే కాకముందు చేపట్టిన పనులను మీ ఖాతాలో వేసుకోవడం ఏమిటి?
- రాజన్నా.. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి.. కడియం శ్రీహరిపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి: కొలిపాక సతీష్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు19 నవంబర్, 202610:47 AM
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టకముందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకోవడం ఏమిటని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొలిపాక సతీష్…

స్టేషన్ ఘన్‌పూర్, నవంబర్ 19 (ప్రజాధ్వని): స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టకముందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకోవడం ఏమిటని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొలిపాక సతీష్ ప్రశ్నించారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన పనులను తమ ఘనతగా చెప్పుకోవడం తగదని, చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్టేషన్ ఘన్‌పూర్‌ను ఇందిరమ్మ గ్రామంగా ఎంపిక చేసిన సందర్భంలో రిజర్వాయర్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అప్పటికి కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదని, రాజయ్య ఎమ్మెల్యేగా లేరని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఆ పనులు తమ హయాంలో జరిగినట్లు ఎలా చెప్పుకుంటారని నిలదీశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేట్ వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సంవత్సరాల సమయం పట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించి, అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును రెండుసార్లు అడ్డుకున్నామని తెలిపారు. అనంతరం ఆయన పరువు పోతుందనే ఉద్దేశంతో ఆర్‌అండ్‌బీ అధికారులతో పనులు పూర్తి చేయించారని పేర్కొన్నారు. అలాగే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కాంగ్రెస్ నాయకులు అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణను కలిసి విజ్ఞప్తి చేశారని తెలిపారు. అప్పటి ఈఈ నాగేందర్, డీఈ జీవన్‌కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వివరించారు. పట్టణంలో నేషనల్ హైవే బ్రిడ్జి నిర్మాణాన్ని అప్పట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకించారని, కనీసం పిల్లర్ల బ్రిడ్జి అయినా నిర్మించాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. జఫర్‌గఢ్, పాలకుర్తి రహదారుల నిర్మాణం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశామని, ఆ తర్వాతే పనులు జరిగాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా విమర్శలు చేయడం తగదని సతీష్ అన్నారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా చెప్పుకునే రాజయ్య హయాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 100 పడకల ఆస్పత్రి, మున్సిపాలిటీ మంజూరు కోసం జీవోలు వచ్చినప్పటికీ పనులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కడియం శ్రీహరి వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో 100 పడకల ఆస్పత్రి, మున్సిపాలిటీ, ఇంటిగ్రేటెడ్ విద్యా, వైద్య సదుపాయాలతో పాటు రైతులకు సాగునీరు అందించే చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, సీఎం రిలీఫ్ ఫండ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రహదారుల నిర్మాణం వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అభినందించాల్సింది పోయి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలు మానుకోవాలని కొలిపాక సతీష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మామిడ్ల శ్రీనివాస్, గట్టు కోటేశ్వర్, సురేందర్, అజీముద్దీన్, నక్క పాపయ్య, ఏలీయా, రమేష్, శివ, కుమార్, శ్రీనివాస్, సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
